GRAIN | ప్రత్యేక మార్గదర్శకాలతో కొనుగోళ్లు

GRAIN | ప్రత్యేక మార్గదర్శకాలతో కొనుగోళ్లు

ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

GRAIN | ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ (Collector) స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు సేవా కేంద్రాన్ని (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ ప్రకటన ప్రకారం రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి, ముఖ్యంగా తేమ శాతం 17 శాతానికి మించకుండా ఆరబెట్టుకుని, తమకు దగ్గరలోని రైతు సేవా కేంద్రాలలో విక్రయించి పూర్తి మద్దతు ధర పొందవచ్చని సూచించారు.

రైతులు (Former) తమకు అనువైన తేదీన, సమయాన ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా, రైతు సేవా కేంద్రంలోగానీ లేదా వాట్సాప్ ద్వారా గానీ షెడ్యూల్ చేసుకుని కూపన్ పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు. తమ ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించాలో రైతులే సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించిందన్నారు. రవాణా రైతు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, మిల్లు మండలంలో ఎంత దూరమైనా సరే, రవాణా ఖర్చు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. పారదర్శకత కోసం జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరన్నారు. ధాన్యం రవాణాలో అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకత కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

కల్లం నుండి మిల్లుకు ధాన్యం చేరే వరకు ప్రతి వాహనాన్ని జీపీఎస్ (GPS) పరికరం ద్వారా ప్రభుత్వం ట్రాక్ చేస్తుందని తెలిపారు. ప్రతి ఆర్‌ఎస్‌కే వద్ద జీపీఎస్ పరికరం అమర్చబడిన వాహనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, రైతులు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం ద్వారా జీపీఎస్ వాహనాలలోనే ధాన్యాన్ని తరలించాలని, జీపీఎస్ లేని వాహనంలో తరలించడం అనుమతి లేద‌న్నారు. ట్రక్ చిట్ జెనరేట్ అయినప్పటి నుంచి ట్రిప్ ట్రాకింగ్ మొదలవుతుందని, మిల్లు వద్దకు చేరిన వెంటనే ముగుస్తుందని, ముందుగా మిల్లుకు ధాన్యం పంపడం లేదా మిల్లులో ట్రక్ చిట్ జెనరేట్ చేయడం నిషిద్ధమని కలెక్టర్ తెలిపారు. ప్రతి మిల్లు వద్ద జిల్లా యంత్రాంగం ఒక కస్టోడియన్ ఆఫీసర్ (సీఎస్‌డీటీ లేదా ఆర్‌ఐలేదా వీఆర్‌వో) ను నియమించిందని తెలిపారు. మిల్లు వద్ద ధాన్యాన్ని దింపించడం, మిల్లర్లు ధాన్యం ముట్టినట్టు అక్నాలెడ్జ్ చేయించడం, రసీదు తీసుకోవడం ఈ అధికారి బాధ్యతని ఆయన వివరించారు.

ధాన్యం తూకం పూర్తయ్యాక, రైతు సేవా కేంద్రం సిబ్బంది ట్రక్ షీట్‌తో పాటు ఎఫ్‌టీఓ (FTO) (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) ను జనరేట్ చేసి రైతుకు అందించాలన్నారు. ఎఫ్‌టీఓ జనరేట్ చేయడానికి రైతు వేలిముద్ర లేదా ఓటీపీ తప్పనిసరన్నారు. ఎఫ్టీఓ, మిల్లు అక్నాలెడ్జ్‌మెంట్ రెండూ పూర్తయిన తర్వాతనే రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నారు. ధాన్యం అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1967, జిల్లా కంట్రోల్ రూమ్ నంబ‌ర్ 9963479141లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే, ఆర్‌ఎస్‌కే వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా తమ అభిప్రాయం చెప్పవచ్చునన్నారు.

Leave a Reply