Puranapanda | వికృత మనస్తత్వాల వెక్కిరింతల మనుషులతో జాగ్రత్త !

Puranapanda | వికృత మనస్తత్వాల వెక్కిరింతల మనుషులతో జాగ్రత్త !

Puranapanda, హైదరాబాద్, ఆంధ్రప్రభ : అత్యద్భుతమైన చిత్రాలకోసం మీరంతా రాత్రీ పగలూ ఎంతో ఎంతో శ్రమించి ఇలాంటి అపురూపమైన చిత్ర కళాఖండాల్ని ఇక్కడ ప్రదర్శించడం మామూలు విషయం కాదని , ఈరోజుల్లో ఇంత పెద్ద చిత్రకళా సమూహం అంటే సుమారు ఎనభై పైచిలుకు మంది చిత్రకళాకారులు ఎవరి ప్రత్యేకతలతో వారు ఇలా కలవడం ఎంతో ఎంతో ఆనందాన్నిస్తోందని ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అభినందించారు.

అమలాపురంకి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని జె ఎన్ టీ యు నెహ్రు ఆర్ట్ గ్యాలరీలో ఐదవసారి మాస్టర్ స్ట్రోక్ పేరిట మూడు రోజులపాటు జరిగిన ఆర్ట్ ఎక్సిబిషన్ ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ.. వెక్కిరింతల, దేబిరింపుల, అసూయపరుల , వికృత మనస్తత్వాల స్వార్ధాలతో సంచరించే మనుషుల మనస్తత్వాలతో చాలా జాగ్రత్తగా వుండాలని ఉదాహారణలతో చెప్పినప్పుడు హాలంతా చప్పట్లతో మార్మ్రోగిపోయింది.

కుంచె నుండి ఒక చిత్రం అపూర్వ చిత్రంలా ఉదయించడానికి , కుంచెలో మీ మనస్సు జీవించడానికి , కుంచె నుండి సామాజిక తాత్విక దృక్పథాన్ని, బ్రతుకు పోరాటాన్ని ఆవిష్కరించడానికి చిత్రకారుడు రేయింబగళ్లు పడే శ్రమను ఎవ్వరం కొలవలేమని శ్రీనివాస్ తనదైన శైలిలో చక్కని భాషతో పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా అనేకమంది క్రొత్త పాత చిత్రకళాకారులకు ఆలంబనగా నిలుస్తూ ఎన్నెన్నో ప్రదర్శనలను , పోటీలను ఎంతో సాహసంగా ఏర్పాటుచేస్తున్న ఆకొండి అంజిని ఆయన అభినందించారు.

తన ప్రసంగంలో ప్రఖ్యాత చిత్రకారులైన డాకోజు శివప్రసాద్ , వై . శేషబ్రహ్మంలను శ్రీనివాస్ ఎంతో గౌరవ వాచకాలతో సంబోధించడం అందరినీ ఆకర్షించింది. జాతీయస్థాయి చిత్రకారులు వై. శేషబ్రహ్మం అధ్యక్షతన ఆద్యంతం అత్యంత ఆసక్తిగా నడిచిన ఈ సభలో పురాణపండ శ్రీనివాస్ ప్రసంగం హైలెట్ నిలిచిందనే అక్కడ ఆశీనులైన వందలకొలది యావత్తు చిత్రకళాకారులూ ముక్తకంఠంతో మాట్లాడుకోవడం మీడియా కంటపడటం విశేషం. కేవలం ఆంధ్ర , తెలంగాణా ప్రాంతాల నుంచే కాకుండా కేరళ, తమిళనాడు , కర్ణాటక , వెస్ట్ బెంగాల్ వంటి సుదూర ప్రాంతాలకు చెందిన చిత్రకారులు ఈ ప్రదర్శనలో తమ అపూర్వ కళాఖండాల్ని ప్రదర్శించడం విశేషం.

ఈ సభలో సీనియర్ ఆర్టిస్ట్ , ప్రఖ్యాత గాయకులు దాకోజు శివప్రసాద్, మనస్తత్వ శాస్త్రవేత్త, ఫామిలీ కౌన్సిలర్ శ్రీమతి గుర్రం రెడ్డి, ప్రముఖ చిత్రకారులు అమీర్జాన్ భాషా , ప్రముఖ యువనటులైన హనుమాన్ చాలీసా విశేష ప్రచార గాయకులు సుబ్బు చంద్రగిరి, రిటైర్డ్ రిజిస్ట్రార్ సుందరకుమార్ , ప్రముఖ రచయిత సుబ్బు ఆర్. వి, కందిపల్లి రాజు, ప్రముఖ చిత్రకారిణులైన కాకినాడకు చెందిన రజని , హైదరాబాద్ కు చెందిన మాధవిబాలసుబ్రహ్మణ్యం, రజని , ఆదోనికి చెందిన ఆర్ట్ టీచర్ ఎన్. కీరా , వినుకొండకు చెందిన వజ్రగిరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్. వెంకట రామశాస్త్రి తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు అత్యద్భుతంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి నిర్వహించిన ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజిని ప్రదర్శన ప్రారంభంలో జె . ఎన్ .టి . యూ . వైస్ ఛాన్సలర్ టి. గంగాధర్ ప్రశంసిస్తూ చిత్రకారుల ప్రదర్శనని తిలకించడం విశేషం. ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆనందరావు కూడా వందలాది చిత్రకారుల చిత్రాల్ని వీక్షించడం … ఈ మూడు రోజులూ ఎంతోమంది రసజ్ఞులు చక్కగా పాల్గొనడం ఉత్తేజాన్నిచ్చిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎనభైమంది కళాకారులకు సత్కార వస్త్రంతోపాటు అవార్డు, ప్రముఖ కవయిత్రి మంజులా సూర్య ‘ నెమలీక ‘ చక్కని కవితా సంకలన గ్రంధంతో పాటు తిరుమల లడ్డు కూడా క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థ అందరికీ అందివ్వడం గొప్ప విశేషంగా అనిపించిందని ఎంతోమంది చిత్రకారులు పేర్కొనడం మీడియా కంటబడింది. ఇటీవలి కాలంలో ఇంతమంది చిత్రకారులు ఒకే చోట సమావేశమవ్వడం చరిత్రాత్మకంగానే చెప్పాలని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ సభలో పేర్కొన్న వాక్యం యదార్థంగానే స్పష్టమైందని సీనియర్ చిత్రకారులు ముక్తకంఠంతో పేర్కొనడం గమనార్హం.

Leave a Reply