protest | బెల్లంపల్లిలో కార్మికుల నిరసన..

protest | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రైల్వే కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ సికింద్రాబాద్ డివిజన్ జనరల్ సెక్రెటరీ శంకర్ రావు, డివిజనల్ సెక్రెటరీ రవీందర్ లు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లోని ఆర్ ఓ హెచ్ డిపో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, లోకో పైలట్ డిపార్ట్మెంట్ లలో కార్మికులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి చైర్మన్ ఎస్ నాగరాజు, సెక్రెటరీ జి సాంబశివుడులు మాట్లాడుతూ.. 8వ వేతన సంఘం సిఫారసులను 2026 జనవరి 1 నుంచి ఉద్యోగులందరికీ అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులకు న్యాయం చేయాలని, అలాగే సేఫ్టీ కేటగిరీలలో పని చేస్తున్న సిబ్బందికి రిస్క్, హార్డ్షిప్ అలవెన్సులు చెల్లించాలని కోరారు. ట్రాక్ మైంటెనెన్స్ కార్మికులకు కు రిస్క్ అలవెన్సు పెంచాలని డిమాండ్ చేశారు.
ట్రాక్ మెయింటెనర్ల గ్రేడ్ పేలు రూ.2400, రూ.2800లను విలీనం చేసి అందరికీ రూ.4200 గ్రేడ్ పే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ని 10 శాతం పోస్టులను ఎల్డీసీఈకి కేటాయించి, అందరికీ అవకాశాలు కల్పించాలని కోరారు. పాయింట్సెమెన్ కేటగిరీకి నాలుగు గ్రేడ్ పేలతో వేతన నిర్మాణం మంజూరు చేయాలని, దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్-1,గ్రేడ్-2 పోస్టులను విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు వంటి కేటగిరీల్లో పని చేస్తున్న మహిళా సిబ్బందికి ఒక్కసారి ప్రాతిపదికన విభాగాల మార్పుకు అవకాశం కల్పించాలని కోరారు. 2024 జనవరి 1న డీఏ 50 శాతానికి చేరిన నేపథ్యంలో లోకో పైలట్లకు కిలోమీటరేజ్ అలవెన్సు పెంచాలని తెలిపారు. అదే విధంగా 70 శాతం రన్నింగ్ అలవెన్సును ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, అన్ని కేటగిరీల కేడర్ పునర్వ్యవస్థీకరణకు తుదిరూపం ఇవ్వాలని, పెరిగిన సర్వీసులు, కొత్త లైన్లకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని కోరారు. పెట్రోలింగ్ డ్యూటీకి ఇద్దరు పెట్రోల్మెన్లను నియమించి, వారి బీట్ లెంగ్త్ తగ్గించాలని, కీమెన్లకు పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎండబ్ల్యూషెడ్, సిక్ లైన్ షెడ్, లోకో క్రూ లాబీకి చెందిన ఆఫీస్ బేరర్స్, లోకో పైలట్లు పాల్గొన్నారు.
