protest | ఇది పాలన కాదు – ప్రతీకార రాజకీయాలు

protest | పాలకుర్తి, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తోందని పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు బండారి కిరణ్ ఈ రోజు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రతిపక్షాన్ని అణిచివేయడం, భయపెట్టడం, ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో అజెండా లేదని విమర్శించారు. ఈ సందర్భంగా బసంత్‌నగర్ రాజీవ్ రహదారి జీడీ నగర్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ “ఇది పాలన కాదు – ప్రతీకారం” అంటూ నినాదాలు చేశారు.

ప్రజలు రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, నోటీసులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షంపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి, కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థ పాలనను దాచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ హామీల అమలులో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని మళ్లించేందుకే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.

Leave a Reply