దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి..

దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి..

  • నిందితురాలు అరెస్టు
  • 125 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం

భవానిపురం, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి టెంపుల్ లో జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితురాలిని అరెస్టు చేసి దొంగిలించిన బంగారు వస్తువులను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరుకు చెందిన కాకర్ల సుష్మ 2023 జనవరి 3న కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి హాజరై అనంతరం అమ్మవారి దర్శనం కోసం దేవస్థానానికి వచ్చారు.

మధ్యాహ్నం సుమారు 12.27 గంటల సమయంలో రావిచెట్టు ప్రాంతం వద్దకు వచ్చిన తర్వాత తన బ్యాగ్ జిప్ తెరిచి మళ్లీ మూయడం మర్చిపోవడంతో బ్యాగ్‌లో ఉన్న సుమారు 125 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. వెంటనే దేవస్థానం అవుట్‌పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. రావిచెట్టు వద్ద ఉన్న కెమెరా పనిచేయకపోయినా పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఆధారంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను గుర్తించారు. ఆమె రాజగోపురం ప్రాంతం నుంచి మెట్ల మార్గం వైపు వెళ్లి ఆటోలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఆ ఆటోను సీసీ కెమెరాల ద్వారా అనుసరించగా వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో దిగినట్లు తేలింది.


తదుపరి సాంకేతిక ఆధారాలు, నెట్‌గ్రిడ్‌ వంటి ఇంటెలిజెన్స్ పద్ధతుల సహాయంతో నిందితురాలి వివరాలను సేకరించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన కోవెలకొండ నేరదగా గుర్తించారు. గతంలో కూడా 2022లో ఒక కేసు, 2023లో రెండు పర్స్‌లిఫ్టింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలిని పట్టుకుని ఆమె వద్ద నుంచి దొంగిలించిన సుమారు 125 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు విచారణలో భాగంగా సంఘటన జరిగిన సమయంలో రావిచెట్టు ప్రాంతం నుంచి బయటకు వెళ్లిన సుమారు 80 మందిని సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి చివరకు నిందితురాలిని గుర్తించినట్లు వివరించారు. దుర్గగుడిలో ఇటీవల జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు సమర్థంగా ఛేదించినట్లు ఏ డిసీపీ గుణ్ణం రామకృష్ణ, సీఐ గున్ రామ్ తెలిపారు.

Leave a Reply