ప్రధాని పర్యటనలో అప్రమత్తత అత్యవసరం

ప్రధాని పర్యటనలో అప్రమత్తత అత్యవసరం

రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై క‌ర్నూలులో అధికారుల‌తో స‌మీక్ష‌

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ ): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. బుధ‌వారం క‌ర్నూలు జిల్లా పోలీసు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మీక్షా స‌మావేశంలో భద్రతా ఏర్పాట్లపై డీజీపీ మాట్లాడారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. బందోబస్తు విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి తన బాధ్యత పట్ల అప్రమత్తంగా ఉండాలి,అని సూచించారు. రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు, కాన్వాయ్ రూట్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ ప్రదేశాలన్నీ ముందుగానే పరిశీలించాలి. రోడ్ షో ఉన్న చోట్ల సరైన బ్యారికేడ్లు, రోప్ పార్టీలు సిద్ధంగా ఉంచాలి. అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలి. క్రౌడ్ కంట్రోల్ కోసం సెక్టార్ ఇన్‌చార్జ్ ఐపీఎస్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

మ్యాన్ ప్యాక్‌లలో ఉన్న కమ్యూనికేషన్ ఛానెల్స్‌ను ఇయర్‌ఫోన్స్‌కు కనెక్ట్‌ చేసి, ఎప్పటికప్పుడు కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రజా గ్యాలరీల్లో గుమిగూడకుండా, వెనుక ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని డీజీపీ పేర్కొన్నారు. అడిషనల్ డీజీపీ ఎన్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నన్నూరు టోల్‌గేట్‌ వద్ద అవసరమైతే తాత్కాలిక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. బహిరంగ సభ ప్రాంగణంలో మఫ్టీ పోలీసులను నియమించి భద్రతను కట్టుదిట్టం చేయాలి. విఐపీలు వెళ్లేంతవరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు.

అంత‌కుముందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రధానమంత్రి పర్యటన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌, రూట్ మ్యాప్‌, రాగమయూరి బహిరంగ సభ స్థలం, గూగుల్ జియో మ్యాప్‌లను ప్రదర్శిస్తూ వివరణాత్మకంగా వివరించారు. సమావేశంలో ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, గోపీనాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, సత్య యేసు బాబు, ఫక్కీరప్ప కాగినెల్లి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply