Press conference | రిజర్వేషన్లు కల్పించాలి

Press conference | రిజర్వేషన్లు కల్పించాలి
- షెడ్యూల్ ఏరియా ఎస్సీలకు సీట్లు కేటాయించాలి
- ఏజన్సీ ఏరియా ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మోదుగు జోగారావు
Press conference | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : షెడ్యూల్ ఏరియాలో నివసిస్తున్న ఎస్సీలు, వెనుకబడిన వర్గాలకు త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించాలని ఏజన్సీ ఏరియా ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మోదుగు జోగారావు, ప్రధాన కార్యదర్శి వేల్పుల నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో 2019లో జరిగిన మొదటి సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం కారణంగా దళితులకు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం దక్కక తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన మండలాల్లో ఎస్సీలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజన ప్రాంతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు స్థానాలకు 50 శాతం ఎస్టీలు, మిగిలిన ఏబై శాతం రిజర్వేషన్లను జనరల్ కేటగిరీకి కేటాయించి ఎస్సీ,బీసీలకు మొండి చెయ్యి చూపారని ఆరోపించారు.
ఏజెన్సీ ప్రాంతంలోనీ లోకల్ బాడీ ఎలక్షన్లల్లో రిజర్వేషన్ల కల్పించాలని హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు జోగారావు వెల్లడించారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంగి సుందర్ రావు, ఉబ్బపల్లి సంజీవ రావు, బీసీ సంఘాల నాయకులు వల్లోజీ రమేష్, ముదిగొండ వెంకటప్పయ్య, కారుమంచి సాయిబూ, పోతురాజు కృష్ణ పాల్గొన్నారు.
