Prayagraj | మహాకుంభమేళాలో.. పూల వర్షం
- పుణ్య స్నానంతో తరించిన భక్తులు
- వసంత పంచమికి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం
- త్రివేణీ సంగమంలో అమృత స్నానాల హంగామా
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు
- స్నానమాచరించిన నాగసాధువులు, స్వామీజీలు, అఖాడాలు
- హెలీక్యాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించిన నిర్వాహకులు
ప్రయాగ్‌రాజ్, ఆంధ్రప్రభ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళ భక్తజన సంద్రమైంది. సోమవారం వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే చలిని లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.
కట్టుదిట్టమైన చర్యలు..
మరోవైపు ఇవాళ ఉదయం 8 గంటల వరకు దాదాపు 63 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో మహా కుంభమేళా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది. మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేశారు. బారికేడ్లు ఏర్పాటుతోపాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్‌లో పంపించారు. అదేవిధంగా ప్రయాగ్‌రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.