నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కొత్త కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రతీక్ జైన్ పరిపాలనలో సమర్థత, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు.

అనంతరం రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. తరువాత వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా సేవలందిస్తూ పరిపాలనలో తన ప్రతిభను చాటుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇవ్వనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శక, బాధ్యతాయుత పరిపాలన అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతీక్ జైన్ నాయకత్వంలో నారాయణపేట జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply