Praja Darbar | సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్

Praja Darbar | సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు.
ప్రజాసేవలో భాగంగా ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సేవలను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.
ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి సూచించారు. సమస్యలపై అవగాహన కల్పించడం కూడా అధికారుల బాధ్యతేనని స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో పాలకులు ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యపరిచారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హత ఉన్న వారికి కొత్త పెన్షన్లు, నివాస గృహాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
