పొన్నం ఆదేశం..
ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ ప్రతినిధి – మొంథా తుఫాన్ నష్టం అంచనాలను వ్యవసాయ అధికారులు, క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, నష్టపోయిన ఏ ఒక్క రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హనుమకొండ జిల్లాలోని భీమ్ దేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో జరిగిన తుఫాను నష్టం పై నిర్ణీత నమూనాలో అంచనా నివేదికలను సిద్ధం చేయాలని ఆయన ఆదివారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీ రాజ్, ఆర్అండ్ బి రోడ్లు ఎంత మేరకు మరమ్మత్తులకు గురైందనే అంశాలను క్షేత్ర స్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్దం చేయాలని, తాత్కాలిక మరమ్మత్తులు, శాశ్వత మరమ్మత్తులకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు. విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, నీటి వనరుల వివరాలు సమర్పించాలన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారు చేసి నష్టపోయిన ప్రజలకు సహాయం చేరేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

