pollution | క‌మ్మేస్తున్న కాలుష్యం

pollution | క‌మ్మేస్తున్న కాలుష్యం

  • చౌటుప్పల్ డివిజన్‌లో పరిశ్రమలు
  • ర‌సాయ‌నాల‌తో గాలి, నీరు కలుషితం
  • ప్రజల ఆరోగ్యం తో చెలగాటం
  • కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల‌ని డిమాండ్‌

pollution |చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, చిట్యాల మండలాలలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి గాలి నీరును కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు గ్రామాలలో ఫార్మా భూతం విస్తరిస్తుంది. కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ నగర పరిసరాల్లోంచి దూరంగా తరలించాలని ఇటీవలి కాలంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి మూకుమ్మడిగా చెబుతున్నారు. నగరానికి దూరంగా అంటే ఎక్కడికి? ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ అవతలికి మార్చాలని వారే స్పష్టంగా చెబుతున్నారు. ఇంకా చిత్రం ఏమంటే కోర్టులు కూడ అదే మాట చెప్తున్నాయి. నగరంలో కాలుష్యం వద్దు అనేది బాగానే ఉంది. కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కానీ కాలుష్య కారక పరిశ్రమలను ఎక్కడకు తరలించాలి. ప్రజలు నివసించే చోటుకి తరలించాలా ! ప్రజలు లేని చోటుకి తరలించాలా అనేది స్పష్టం చేయడం లేదు.

ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ బయటకు అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి తరలించాలనేది ప్రభుత్వ ఉద్దేశమా ! ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మండలాలలో, ప్రధానంగా చౌటుప్పల్ డివిజన్ లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమల వల్ల పీల్చే గాలి, తాగే నీరు, పంట భూములు, భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండకపోగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుటికే నల్గొండ జిల్లా ఫార్మా డంపింగ్ యార్డ్ గా మారుతున్నది. గతంలో పటాన్ చెరువు, బాలానగర్, బొల్లారం, కూకట్ పల్లి ప్రాంతాలను విషతుల్యం చేసిన ఫార్మా పరిశ్రమలు ఇప్పుడు చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, చిట్యాల మండలాలను ముంచెత్తుతున్నాయి.

పరిశ్రమల చుట్టూ ఉన్న భూమిని, చెట్ల ఆకులను, గాలిని, భూగర్భజలాలు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ప్రపంచ దేశాలు ఫార్మా పరిశ్రమలు వదిలించుకుంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు అక్కడ ఫార్మా యూనిట్లను మూసివేసి మనదేశంపై పడుతున్నాయి. మనదేశాన్ని ఫార్మా, వాక్సిన్లకు ప్రయోగశాలగా మార్చుకుంటున్నట్లు అక్కడ దేశాలే చెప్తున్న విషయం తెలిసిందే. మనం ప్రపంచమంతా మేలుకున్నాక చివరగా మేలుకుంటాం. ఇతర దేశస్తులు మన దగ్గర పెట్టుబడులు పెడతామంటే వారు దేనికి పెట్టుబడులు పెడతారు అనేది పాలకులు ఆలోచించకుండానే స్వాగతం పలకడం పట్ల కాలుష్య బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లోరైడు భూతాన్ని ఇప్పుడిపుడే వదిలించుకుంటున్నాం. మళ్ళీ కాలుష్యం భూతాన్ని జిల్లాపై రుద్దుతారా? ఇటీవలే ఒక కంపెనీలో పేలుడు సంభవించి కెమిస్ట్ ఒకరు కాలి బూడిద అయిపోయారు. కొన్ని కంపెనీల లో రియాక్టర్లు పేలి పలువురు గాయపడడంతో పాటు పరిసర గ్రామాలలోని ఇండ్లు దెబ్బతిన్నాయి. మరి కొన్ని పరిశ్రమలు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. కాలుష్యానికి తోడు ఫార్మా కంపెనీలలో తరచుగా పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మన దగ్గర ఇప్పుడున్న కాలుష్య కారక ఫార్మా కంపెనీలను మూసివేయాలని, వీలు కాకపోతే మరోచోటకు తరలించాలని కాలుష్య బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలో చేస్తుండగా పాలకులు అవేవీ పట్టించుకోకుండా ఫార్మా భూతాన్ని ఇంకా పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, సామాజిక సంస్థలు కాలుష్యకారక పరిశ్రమలను అడ్డుకొని ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలను, గాలి, నీరు, పంటలను కాపాడవలసిన అవసరం ఉంది.

Leave a Reply