బీసీ రిజ‌ర్వేష‌న్ల చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు


ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజ‌కీయాలు (Telangana Politics) బీసీ రిజ‌ర్వేష‌న్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అంశం రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెంచింది. రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఇదొక అస్త్రంగా మారింది. గత కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని జూన్ 25వ తేదీన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government), ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాగాన్ని అన్ని పార్టీలు ఆలపిస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు వాడివేడి వాగ్బాణాలు వదులుతున్నాయి. వీటికి బ‌దులుగా ఆయా పార్టీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. ఈ అంశంపై ఏ పార్టీ ఏం అంటోంది, ఆ మాటల వెనుక రాజకీయ కోణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…


బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు రెండు కీలక బిల్లులను శాసనసభలో ఆమోదించింది. ‘తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ (విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్) బిల్, 2025’ ‘తెలంగాణ బీసీ (స్థానిక సంస్థల్లో రిజర్వేషన్) బిల్, 2025’ లను రాష్ట్రపతి ఆమోదం (President approval) కోసం మార్చి 30న పంపించింది. అప్పటి నుంచి ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులను ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తుంది. దీంతో బిల్లును ఆమోదించాల‌ని ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆగస్టు 5-7వరకూ మూడు రోజుల ధర్నాను జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిర్వహిస్తోంది. రేవంత్ రెడ్డి సహా బీసీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన కుల గణన ఆధారంగా బీసీలు 56.33% ఉన్నారని, ఈ రిజర్వేషన్ సామాజిక న్యాయం కోసం కీలకమని కాంగ్రెస్ వాదిస్తోంది. బీజేపీ ఈ బిల్లులను అడ్డుకుంటోందని, బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎంపీలను రాజీనామా చేయాలని సవాల్ (challenge) విసిరారు.


ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) మాత్రం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ చేస్తోంది డ్రామా అని ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసం చేస్తున్నాయ‌ని గులాబీ నేతలు ప్రతీ వేదిక పై నుంచి హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్డినెన్స్ (Ordinance) ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని, ఇదో డ్రామా అని విమర్శ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్‌ కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రధాని వద్దకు అఖిల పక్షం తీసుకెళ్లలేదని ఆరోపణలు చేస్తోంది. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదించకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేమని, ఇది న్యాయస్థానాల ముందు తేలిపోతుందన్న సాంకేతిక అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది.


అయితే.. ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. 42శాతం బీసీ రిజర్వేషన్‌లలో ముస్లిం కోటా (10%) చేర్చడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది బీసీలకు కేటాయించే రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గిస్తుందని, ఇది గతంలో ఉన్న 34 శాతం కంటే తక్కువని బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు (BJP President Ramachandra Rao) వాదిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ వంటి నాయకులు కాంగ్రెస్‌ మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పూర్తి 42 శాతం బీసీలకు మాత్రమే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 2న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ‘మహా ధర్నా’ నిర్వహించింది.


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఆగస్టు 4-6 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద 72 గంటల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్లను బీసీ కోటా నుంచి వేరు చేసి, ముస్లింలకు ప్రత్యేక 10శాతం రిజర్వేషన్ కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. దీనికి బీజేపీ మద్దతు లభిస్తుందని, తద్వారా ఇది ఆమోదం పొందుతుందనేది ఆమె వాదన. అయితే కాంగ్రెస్, బీజేపీలకు బీసీల పట్ల నిజాయితీ లేదని, రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని కవిత ఆరోపించారు.

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30, 2025లోపు నిర్వహించాలని ఆదేశించింది.. స్థానిక ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో ఈ అంశం మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply