Sunil Dutt | అదుపులో నేరాలు..

Sunil Dutt | అదుపులో నేరాలు..

  • ఖమ్మంలో ఫలించిన పోలీసింగ్‌
  • తగ్గిన నేరాలు, పెరిగిన రికవరీలు, బలమైన శిక్షలు
  • నేర నియంత్రణలో ఖమ్మం పోలీసుల విజయం
  • దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌, హత్యల్లో గణనీయమైన తగ్గుదల
  • రూ.2.45 కోట్ల చోరీ సొత్తు రికవరీ… 9శాతం పెరిగిన రికవరీ రేటు
  • సైబర్ నేరగాళ్ల నుంచి రూ.4.5 కోట్లు బాధితులకు రికవరీ… మరో రూ.1.5 కోట్లు హోల్డ్
  • ప్రాసిక్యూషన్–పోలీసుల సమన్వయంతో శిక్షల శాతం పెంపు… 11 కేసుల్లో జీవిత ఖైదు
  • గంజాయి సేవించే వారిపై కేసులు… సరఫరాపై కఠిన కట్టడి
  • 928 రోడ్డు ప్రమాదాలు… 332 మంది మృతి, లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసుల పరిష్కారం
  • పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు గణనీయంగా నియంత్రణలోకి వచ్చాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇవాళ‌ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2025 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో ఈ ఏడాది దోపిడీలు, ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులు స్పష్టంగా తగ్గాయని వెల్లడించారు. హత్యలు, హత్యాయత్నాలు వంటి తీవ్రమైన నేరాల సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు తెలిపారు. పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషి ఈ ఫలితాలకు ప్రధాన కారణమని చెప్పారు. ప్రజల సహకారం, పోలీసుల అంకితభావం నేరాల నియంత్రణకు బలంగా మారిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఖమ్మం పోలీసింగ్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Police Commissioner | చోరీ సొత్తు రికవరీలో రికార్డు పురోగతి…

ఈ ఏడాది చోరీ సొత్తు రికవరీలో పోలీస్ విభాగం గణనీయమైన పురోగతి సాధించిందని కమిషనర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రికవరీ శాతం 9 శాతం పెరిగిందన్నారు. మొత్తం రూ.2.45 కోట్ల విలువైన చోరీ సొత్తును తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసుల ఛేదనలో కూడా 11 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఈ విజయానికి దోహదపడిందన్నారు. ఫింగర్ ప్రింట్స్, డిజిటల్ ఆధారాల సేకరణను మరింత బలోపేతం చేశామని చెప్పారు. నిందితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించామని తెలిపారు. జైలు నుంచి విడుదలైన నేరస్థులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు.

Police Commissioner | సైబర్ నేరాలపై దూకుడు చర్యలు…

సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేయించామని చెప్పారు. మరో రూ.1.5 కోట్లను హోల్డ్ చేయించి బాధితులకు భద్రత కల్పించామని వివరించారు. సైబర్ నేరాల దర్యాప్తులో ప్రత్యేక బృందాలు పనిచేశాయని తెలిపారు. బ్యాంకులు, ఇతర సంస్థలతో సమన్వయం పెంచామని చెప్పారు. విద్యా సంస్థల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. యువత మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నామని తెలిపారు.

Police Commissioner | శిక్షల శాతంలో పెరుగుదల…

ప్రాసిక్యూషన్ అధికారులు, పోలీసుల సమన్వయంతో దోషులకు శిక్షల శాతం పెరిగిందని కమిషనర్ వెల్లడించారు. ఈ ఏడాది 11 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించారని తెలిపారు. కేసుల దర్యాప్తు పటిష్టంగా ఉండటమే ఈ ఫలితాలకు కారణమన్నారు. న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపించామని చెప్పారు. సాక్ష్యాధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కేసుల్లో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. శిక్షలు ఖరారవడం నేరస్థుల్లో భయాన్ని కలిగిస్తోందన్నారు.

Police Commissioner | గంజాయి సరఫరాపై కట్టడి…

గంజాయి సేవించే వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా సరఫరాను కట్టడి చేసినట్లు సునీల్ దత్ తెలిపారు. మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గంజాయి విక్రయించే నెట్వర్క్‌లను ఛేదించామని వివరించారు. యువతను మత్తు బారిన పడకుండా కాపాడడమే లక్ష్యమన్నారు. అవగాహన కార్యక్రమాలతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని చెప్పారు. గంజాయి కేసుల్లో నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమన్నారు.

Police Commissioner | రోడ్డు ప్రమాదాలపై ఆందోళన…

ఈ ఏడాది స్వల్పంగా రోడ్డు ప్రమాదాలు పెరిగాయని కమిషనర్ తెలిపారు. మొత్తం 928 ప్రమాదాల్లో 332మంది మృతి చెందారని చెప్పారు. మరో 809 మంది గాయపడ్డారని వివరించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో లోపాలను సరిదిద్దామని చెప్పారు. సిగ్నల్ లైట్లు, బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామని వివరించారు. రేడియం స్టిక్కర్లతో సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు.

Police Commissioner | లోక్ అదాలత్‌–ప్రజలకు ఉపశమనం…

లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 36,709 కేసులకు పరిష్కారం లభించిందని కమిషనర్ వెల్లడించారు. పెండింగ్ కేసుల తగ్గింపులో ఇది కీలకంగా మారిందన్నారు. ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందుతోందని చెప్పారు. పోలీస్ శాఖ, న్యాయవ్యవస్థ సమన్వయం ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ ఏడాది మొత్తం 9,792 కేసులు నమోదైనట్లు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ విధానంతో నేరాలు కట్టడి అవుతున్నాయని చెప్పారు. పోలీస్ పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయని వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.

Leave a Reply