చుక్కలు చూపించిన రైన్..
ఆంధ్రప్రభ, సిటీ ప్రతినిధి వరంగల్ : హనుమకొండ (Hanumakonda) హంటర్ రోడ్డు సమీపంలోని పద్మావతి గార్డెన్ లోకి వరద నీరు చేరింది. ఫంక్షన్ హాల్స్ రక్షణ లేకుండా ఉన్నాయి అనడానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రాగి చక్రపాణి తమ కూతురు వివాహ వేడుకలు పద్మావతి ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆటంకం లేకుండా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. గురువారం కురిసిన వర్షానికి వారి ప్లాన్ రివర్స్ అయ్యింది. నూతన దంపతులను పంపించిన తర్వాత భోజనం చేసి వెళ్లే టైమ్ కి హఠాత్తుగా ఫంక్షన్ హాలులోకి వరద నీరు చేరింది.

ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో బాధితులు ఉండిపోయారు. జనరేటర్ సహాయం (Generator help) తో రాత్రి 9 గంటల సమయం వరకు కరెంట్ సౌకర్యం ఉంది. ఆ తరువాత చీకట్లో రాత్రంతా జాగారమే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. చివరకు వరంగల్ సీపీకి సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి సహాయక బృందాన్ని పంపించినట్లు తెలిపారు. బోట్ సహాయంతో బాధితులను బయటకు తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి సహాయం లేకుండా వివాహ వేడుకల కోసం వచ్చిన వారంతా చిన్నారులతో సహా 85 మంది ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

