Pitapuram | జ‌న‌సేన‌లో పుష్క‌రోత్స‌వం – ప‌న్నెండేండ్ల సంబురాలు షురూ

నాడు ఏకైక సేనాని..
నేడు జయకేతన ధారి
ఇదే పవనిజం విలాసం
భవిష్యత్ కార్యాచ‌ర‌ణ‌కు అంతా సిద్ధం
12 ఏళ్ల చరిత్రలో ఇదొక పుష్కర ఘట్టం
జ‌య‌కేత‌నం సభకు ప‌ర‌వ‌ళ్లు తొక్క‌నున్న‌ జనసైన్యం
రేపు సాయంత్రం భారీ బ‌హిరంగ‌స‌భ‌
చిత్రాడ‌లో సంద‌డి చేయ‌నున్న అభిమానులు

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఉద్ధానం కిడ్నీ బాధితుల వ్యథపై గళం విప్పి.. బాధితులకు బాసటగా నిలిచి.. కాలుష్య కాసారంగా మారబోతున్న గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్‌ని అడ్డుకుని.. జనంలో జనసేన పోరాట పటిమను నిరూపించిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని ధ్వంసం చేసే క్రతువులో నేను సైతం అంటూ బీజేపీ, టీడీపీకి రాజకీయ మద్దతు పలికారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అంపశయ్యపైకి చేర్చారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో తన బలం.. బలగాన్ని అంచనా వేసుకునేందుకు ఒంటరి పోరాటం చేశారు. ఫలితం ఆరు శాతం ఓట్లతో తన శక్తి తెలుసుకున్నారు. గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కూడా గోడదూకి పారిపోగా.. ఎక్కడా తగ్గలేదు. నీరసించలేదు. దిగులు చెందలేదు. ప్రజలే తన బలం అని నిర్ధారించుకుని.. ప్రజా సమస్యల్నే ఆయుధంగా మలచుకుని.. ఒకే ఒక సైన్యాధ్యక్షుడి భుజాన జెండాను లక్షలాది జెండాలుగా రెపరెపలాడే స్థితికి జనసేనను తీర్చిదిద్దారు. 2024 ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా.. వంద‌కు వంద శాతం విజయాన్ని అందుకుని ఇప్పుడు పుష్క‌రోత్స‌వ సంబురాల వేళ జయకేతనం ఎగురవేస్తున్నారు.

..ఇక కదనోత్సాహం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిన జనసేన సారథి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 12ఏళ్ల కిందట పార్టీని ఒంటరిగా స్థాపించారు. ఇప్పుడు 21మంది ఎమ్మెల్యేలతో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన పార్టీగా జ‌న‌సేన‌ నిలిచింది. జనసేన గెలుపుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా మార్చి 14వ తేదీన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో స్థానిక పార్టీల్లో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని జన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది జనసైనికులతో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని చిత్రాడ దద్దరిల్లబోతోంది.

స‌భా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు..

జయకేతనం భారీ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మరో మంత్రి కందుల దుర్గేశ్ పరిశీలించారు. సభ నిర్వాహణలో లోటుపాట్లు లేకుండా వివిధ కమిటీల నాయకులు, రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక‌ కోసం ప్రత్యేక హెలిపాడ్‌ సిద్దం చేశారు. సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలను సిద్దం చేశారు. ఇక వీర మహిళలు, మహిళ కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ప్ర‌త్యేక హెలిప్యాడ్‌, స‌క‌ల ఏర్పాట్లు..

శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి జ‌న‌సేన ఆవిర్భావ‌ సభ మొదలవుతుంది. న భూతో అనేలా జయకేతనం ఆవిర్భావ సభను నిర్వహించేందుకు 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నలు వైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భోజనం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీ ఏర్పాటులో ..కూటమి ప్రభుత్వం ఏర్పడానికి కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగించ‌నున్నారు. రాబోయే నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేస్తామో.. వివరించనున్నారు. జ‌న‌సేనాని సూచ‌న‌లు, ఆదేశాలు, పిలుపుకోసం అభిమానులు ఆశ‌తో, ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *