- నాలుగు లాడ్జిల్లో రిజిస్టర్ల చోరీ
- జరుగుతున్న సంఘటనలతో ప్రజల్లో ఆందోళన
భద్రాచలం, మార్చి 5(ఆంధ్రప్రభ) : భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై పెట్రోలు బాంబుతో దాడి చేసే ప్రయత్నం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. సూపరింటెండెంట్ టార్గెట్ గా చేసుకుని ఆయన ఛాంబర్ పై పెట్రోల్ బాంబులు విసిరారని తెలుస్తుంది. ఓ వ్యక్తి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు తచ్చట్లాడుతున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయి. జరిగిన సంఘటనతో ఆసుపత్రిలోని రోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై స్పందించేందుకు అధికారులు అందుబాటులోకి రాలేదు.
లాడ్జిలలో రిజిస్టర్ల చోరీ…
భద్రాచలం పట్టణంలోని నాలుగు లాడ్జీలలో ఎంట్రీ రిజిస్టర్ లను గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు. గత సంవత్సరంలో కూడా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. అప్పుడు లాడ్జీల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారు జామున మరొసారి రిజిస్టర్లు చోరీకి గురవడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. రిజిస్టర్ల దొంగతనం వల్ల ఎవరికి అవసరం, అవకాశం ఉందనే ప్రశ్న తలెత్తింది. ఈ రిజిస్టర్లలోనే వారి కస్టమర్ల పూర్తి వివరాలు నమోదు చేస్తారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా బుధవారం భద్రాచలం సీఐని లాడ్జి యజమానులు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగు చూసే అవకాశముంది.