గ్రూప్ – 1 నియామకాలపై మళ్లీ పిటిషన్లు.. హైకోర్టుకెళ్తున్న అభ్యర్థులు !

రాష్ట్రంలో గ్రూప్‌-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్​ సెంటర్ల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు అభ్యర్థులు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

కాగా, గత నెలలోనే ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. పునర్‌మూల్యాంకనం చేయాలని లేదా మరోసారి ప్రధాన పరీక్ష(మెయిన్స్) నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

గ్రూప్‌-1 నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న హైకోర్టు గ్రూప్‌-1 నియామకాలపై స్టే విధించింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్​ ప్రక్రియ పూర్తి చేయొచ్చని ఆదేశించింది.

గ్రూప్​-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని : టీజీపీఎస్సీ గ్రూప్‌-1 నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ గ్రూప్‌-1కు ఎంపికైన 4 అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానంలో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. ఈరోజు విచారణ సందర్భంగా స్టే వెకెట్‌ పిటిషన్లపై వాదనలు జరిగాయి.

కౌంటరు దాఖలు చేసేందుకు టీజీపీఎస్సీ, ఇతర న్యాయవాదులు సమయం కోరారు. విచారణను ఆలస్యం చేయొద్దని, దీని వల్ల ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని హైకోర్టు తెలిపింది. వినిపించిన వాదనలే మళ్లీ వినిపించొద్దని, ఈనెల 30వ తేదీన పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply