పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం
(అనంతపురం, ఆంధ్రప్రభ ప్రతినిధి) : డిసెంబర్ లోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) పంచాయతీ రాజ్ శాఖ అధికారుల్ని ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ ఈఈలు, డీఈలు, ఏఈలతో ఆమె అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, గ్రామ సచివాలయాల నిర్మాణాల గురించి చర్చించారు. వరల్డ్ బ్యాంక్, నాబార్డ్, ఎన్ఆర్ఈజీఎస్, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో ప్రస్తుతం పనులు జరుగుతుండగా.. వాటి పురోగతి గురించి ఆరా తీశారు.
పీఆర్ విభాగం పరిధిలో 11కోట్లతో 22బీటీ రోడ్లు నిర్మిస్తుండగా.. వీటిలో 6కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని ఎప్పటిలోగా పూర్తి చేశారని ఆరా తీశారు. వాటితో పాటు మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ ల గురించి ఎమ్మెల్యే (MLA) సునీత ఆరా తీశారు. మొత్తం 18పెండింగ్ లో ఉన్నాయని చెప్పగా.. వాటిని త్వరితగతిన పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
వీటితో పాటు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ (Prime Minister Ayushman Bhava) కింద 5విలేజ్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. నియోజకవర్గంలోని వేపకుంట, కోనాపురం, నరసంపల్లి గ్రామాల్లో మూడు కొత్త సచివాలయాలు ఒక్కొక్కటి 32లక్షలతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీటిని త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సునీత ఆదేశించారు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే గ్రామీణ ప్రాంతంలో విలేజ్ హెల్త్ క్లినిక్ లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.