Peddapally | గూడ్స్ రైలుపై తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ తీగ.. త‌ప్పిన ప్ర‌మాదం

మృతి చెందిన వానరం
పెద్దపల్లి రూరల్, జులై 29(ఆంధ్రప్రభ) : పెద్దపల్లి (Peddapally) లో విద్యుత్ హైటెన్షన్ వైర్ తెగిపడి పెద్ద ప్రమాదమే తప్పింది. పెద్ద‌ప‌ల్లి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు (Goods train) పై రైళ్ల రాకపోకలకు సరఫరా అయ్యే విద్యుత్ హై టెన్షన్ వైరు (Electric High tension wire) తెగిపడిన సంఘటన మంగళవారం జరిగింది. రైల్వే స్టేషన్ (Railway station) లో 3వ ప్లాట్ ఫాంపై బొగ్గుతో వెళుతున్న గూడ్స్ రైలు నిలిపి ఉంది.

ఒక్కసారిగా హైటెన్షన్ వైరు తెగి నిలిచి గూడ్స్ పై పడడంతో బొగ్గులో నుండి నిప్పు రవ్వలు వెలువడ్డాయి. తెగిపడ్డ విద్యుత్ తీగ గూడ్స్ బోగిపై పడి వానరం షాక్ కు గురై మృతిచెందింది. ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవడంతో అక్కడనున్న ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఇది గమనించిన రైల్వే అధికారులు హుటాహుటిన 3వ ప్లాట్ ఫాం విద్యుత్ వైర్ల ద్వారా సరఫరాను నిలిపివేశారు. వెంటనే తిరిగి మరమ్మతులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

ఒకవేళ ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఈ హైటెన్షన్ వైర్ పడి ఉంటే ప్రయాణీకులకు పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక వానరం మృతిచెందినా, పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణీకులు పేర్కొంటున్నారు.

Leave a Reply