Pedana | వారి సమస్యలు పరిష్కరిస్తాం

Pedana | వారి సమస్యలు పరిష్కరిస్తాం
- పెడనలో బేడ(బుడ్గ) జంగం కమ్యూనిటీ హాల్ భవనాన్ని
- ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్
Pedana | పెడన – ఆంధ్రప్రభ : బేడ(బుడ్గ) జంగం కమ్యూనిటీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె ఎస్ జవహర్ తెలిపారు. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బండి రామకృష్ణతో కలసి పెడన పట్టణం 10వ వార్డులోని రాజీవ్ నగర్ లో నూతనంగా నిర్మించిన బేడ(బుడ్గ) జంగం కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ… బేడ(బుడ్గ) జంగం కమ్యూనిటీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడ్డారని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు కుల ధృవీకరణ పత్రాలు పొందలేకపోవడం బాధాకరమన్నారు. దీనివల్ల వారు విద్యావకాశాలతో పాటు ఇతర రంగాలలో ఎంతో నష్టపోతున్నారని, దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని శాశ్వత పరిష్కారం పొందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బేడ(బుడ్గ) జంగం కమ్యూనిటీ హక్కుల కోసం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అదేవిధంగా నిధులు కోసం ఎవరిని అభ్యర్థించకుండా కుల సంఘస్తులే సొంతగా కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు.

పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… బేడ(బుడ్గ) జంగం కమ్యూనిటీకి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉందని, దీనివలన ప్రభుత్వ పథకాలు పొందడంలో, విద్యా అవకాశాల్లో ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. గతంలో ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని గుర్తు చేస్తూ, మరల ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, తలెత్తే ఎలాంటి సమస్యకైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సూపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బేడ బుడ్గ జంగం కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు, పెడన మున్సిపల్ వైస్ చైర్మన్ బైలపాటి జ్యోతి, పదో వార్డు పార్టీ ఇంచార్జ్ వంకా ప్రసాద్, కుల సంఘ నాయకులు పస్తం వాకలయ్య, కూటమి నాయకులు కొండపల్లి దుర్గారావు, దాసరి సత్యనారాయణ, డెక్కల శ్యామలయ్య, కమ్మగట్టి బాబు తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
