PBKS vs RCB | అదరగొట్టిన పంజాబ్ బౌలింగ్ దళం.. టార్గెట్ ఎంతంటే !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) – పంజాబ్ కింగ్స్ మధ్య పోరు హోరాహోరీగా జ‌రుగుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ, పెద్ద స్కోరు నమోదు చేయలేక తీవ్రంగా నిరాశపరిచింది.

పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఆర్సీబీ టాప్ ఆర్డర్ తడబడ్డది. దీంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది.

ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. అతనితో పాటు మయాంక్ అగర్వాల్ కూడా 24 పరుగులకే అవుట్ కావడం జట్టుకి ఎదురుదెబ్బగా మారింది. రజత్ పాటీదర్ (26) – లియామ్ లివింగ్‌స్టోన్ (25) స్వల్పంగా కుదురుకున్నా, పెరిగిన ఒత్తిడికి ఎక్కువసేపు నిలవలేకపోయారు.

విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మిగిలిన బ్యాటర్లు అంతగా సహకరించకపోవడంతో ఆ ప్రయత్నం సార్థకంకాలేదు.

చివర్లో జితేష్ శర్మ 10 బంతుల్లో వేగంగా 24, రొమారియో షెపర్డ్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి కొంత ఊపునిచ్చినప్పటికీ, పెద్ద భాగస్వామ్యం ఏదీ ఏర్పడకపోవడం ఆర్సీబీకి ప్రధాన అవరోధంగా మారింది.

పంజాబ్ బౌలర్లు ప్రారంభం నుండే పేస్, స్పిన్‌ల మేళవింపుతో బెంగళూరు బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టేశారు. ఫీల్డింగ్‌లోనూ పంజాబ్ శ్రేష్ఠ ప్రదర్శన కనబరిచింది. అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామిసన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, అజ్మతుల్లా ఒమర్జాయ్, వైశాక్ విజయ్‌కుమార్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్ ముగిసిన తరుణంలో.. తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న పంజాబ్, 191 పరుగుల విజ‌య‌లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించనుంది.

Leave a Reply