విద్యార్థులతోపాటు బుద్ధిగా పాఠం విన్న మంత్రి లోకేష్
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో అపూర్వ సన్నివేశం
వనరులు అనే సబ్జెక్టుపై స్టూడెంట్స్‌కి క్లాస్
విద్యార్థులు రాజకీయాలపై ఆసక్తిపెంచుకోవాలి
భవిష్యత్ తరాలకు మంచి లీడర్లు కావాలి
ఉపాధి రంగాలతో పాటు పొలిటికల్‌గా ఎదగాలి
8వ తరగతి విద్యార్థులతో సీఎం చంద్రబాబు
విద్యార్థి దశలోనే మార్పు రావాలన్న ముఖ్యమంత్రి
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రస్తుతం విద్యార్థుల్లో (students ) రాజకీయాలపై (politics ) ఆసక్తి లేని స్థితిలో.. పెద్ద చదువులతో ఉద్యోగాలు (jobs ) సంపాదించటమే కాదు.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకులు (public service ) కావాలని, ప్రజాప్రతినిధులు కావాలని సీఎం చంద్రబాబు (cm chandra babu ) అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి లోకేష్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూలులో.. సీఎం చంద్రబాబు ఉపాధ్యాయుడి పాత్ర పోషించారు. సుమారు 30 నిముషాలు జరిగిన ఈ బోధన అంత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇదే తరుణంలో ఓ కీలక సన్నివేశం చోటు చేసుకుంది. విద్యార్థులు రాజకీయ నాయకులుగా మారాలని సీఎం తన అభిలాషను వ్యక్త పరిచారు. వనరుల పాఠ్యాంశం బోధన ముగియగానే.. పాఠం అర్థమైందా అని ప్రశ్నించారు. విద్యార్థులందరూ అర్థమైందన్నారు. ఈ టీచర్ బాగా చెప్పారా? అని మంత్రి లోకేష్ అనగానే.. ఒక విద్యార్థి మాత్రం ఇద్దరూ సమానమే అన్నాడు. ఇతడు రాజకీయ నాయకుడవుతాడని లోకేష్ అన్నారు.

ఉద్యోగంతోపాటు.. రాజకీయాలు అవసరమే
మీలో రాజకీయ నాయకులు అయ్యేది ఎవ్వరు? అని సీఎం ప్రశ్నించగా.. క్లాసులో విద్యార్థులెవరూ చేతులు ఎత్తలేదు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీరు రాజకీయ నాయకులు కారా. ప్రజా సేవకులు కారా, మీరు ప్రజాప్రతినిధులు కూడా కావాలి. చదువుకున్నోళ్లు అందరూ స్వార్థంతో ఉద్యోగాలు చేస్తే, రాజకీయాలే శాసిస్తాయి. మన జీవితాలను శాసిస్తాయి. అమ్మకు వందనం ఇచ్చాం? మీ మంత్రి ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. మంత్రి అయ్యాడు. అమ్మకు వందనం ఇచ్చాడు. ఇది ప్రభుత్వ విధానం అవునా ? కాదా? .. ఇది ఎలా వచ్చింది? ఆయన ఆలోచన నుంచి వచ్చింది. మీకు టెక్నాలజీ తెచ్చాడు. మీరు స్కూలుకు రాకపోతే పదిన్నరకు మీ అమ్మానాన్నకు మెసేజీ వెళ్తుందా. మీరు డుమ్మా కొడతారా? డుమ్మా కొడ్తానికి వీలు లేదు. అని వివరించి విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు.

సహజవనరులను సద్వినియోగం చేసుకోవాలి..
అంతకుముందు 8వ తరగతి గదిలోకి రాగానే విద్యార్థులను సీఎం చంద్రబాబు పలకరించారు. మీరు ఎన్నో తరగతి చదువుతున్నారని ప్రశ్నించారు. దీనికి 8వ తరగతి అని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. ఇక సీఎం టీచర్ పాత్రను ప్రారంభించారు. సోషల్ సైన్సెస్ లో వనరులు పాఠ్యాంశాన్ని ప్రారంభించారు. వనరులు అంటే ఏంటో నిర్వచించారు. ఇందుకు ఓ చిన్న కథను వినిపించారు. మోనా, రాజు ఇంటిని శుభ్రం చేస్తున్నారు, అక్కడ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు,దువ్వెనలు. పుస్తకాలు తేనె ముఖ్యమైనవని ఇవ్వన్నీ వనరులు అని మోనా చెప్పింది. వనరులు అంటే ఏమిటనీ తల్లిని రాజు అడిగారు. వినియోగంలోని వస్తువులన్నీ వనరులని, వనురలన్ని విలువైనవని తల్లి చెప్పిందని సీఎం వివరించారు. ఇలా సాగిన ఈ పాఠంలో సహజ వనరులు, పునరుత్పాదక వనరుల వినియోగం, సంరక్షణ గురించి విద్యార్థులకు సీఎం బోధించారు.

విద్యార్థులతో కలిసి పాఠం విన్న మంత్రి లోకేష్..
సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్ధులకు సీఎం చంద్రబాబు వివరించారు. విద్యార్ధులు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా ఇతరులు మరోమారు వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అని చెప్పారు. చదువుతోనే జ్ఞానం పెరుగుతుందని, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలన్నారు. ఇక ఏడో తరగతిలో మార్కుల రిపోర్టును అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని భావిస్తున్నారని ప్రశ్నించారు. ఐఏఎస్‌లు , డాక్టర్లు , పోలీసులు కావాలనుకునే విద్యార్థులు చేతులు పైకి ఎత్తారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి ఎంతమంది వస్తారని ప్రశ్నించగా ఎవ్వరూ చేతులు పైకి ఎత్తలేదు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందించి అందరూ ఉద్యోగాలే కాదు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగానూ మారాలన్నారు. నారా లోకేశ్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. విద్యార్థులతోపాటు బల్లపై కూర్చుని సీఎం చెప్పే పాఠాన్ని ఆసక్తిగా విన్నారు.

పేరెంట్స్ తో మాటా మంతీ..
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌లో చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు దిగారు. పాఠశాలకు వచ్చిన సీఎంకు ఎన్సీసీ క్యాడెట్‌లు గౌరవ వందనం సమర్పించి స్కూల్లోకి తీసుకుని వచ్చారు. జెడ్పీ పాఠశాల క్యాంపస్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాటామంతి నిర్వహించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడంతో పాటు.. మార్కులు పెంచుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. హాజరు, మార్కుల వివరాలను తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు.