- 17 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ
- చివరి రోజు హోరెత్తిన ప్రచారం
- పంచాయతీ ఎన్నికలపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో, అంటే డిసెంబర్ 14న, పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. అభ్యర్థులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో తమ ప్రచారాన్ని అట్టహాసంగా సాగిస్తున్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య, ఓటర్ల వివరాలు వెలువడటంతో ఎన్నికల హోరు మరింత స్పష్టమైంది. శుక్రవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు భారీ ఎత్తున ప్రచారం చేశారు.
23,464 మంది ఓటర్లు – స్త్రీలే ఆధిక్యం
బెల్లంపల్లి మండలం మొత్తం 23,464 మంది ఓటర్లతో పోలింగ్‌కు సిద్ధమైంది. మదర్ రోల్ ప్రకారం, మహిళా ఓటర్లే స్వల్పంగా పురుషులపై ఆధిక్యంలో ఉండటం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది.
17 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల వివరాలు
- పురుషులు11,625
- స్త్రీలు11,838
- ఇతరులు1
- మొత్తం23,464
మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడం వలన, ఈసారి జరిగే పోలింగ్‌లో మహిళా ఓటింగ్ శాతం పెరగడంతో పాటు, ఫలితాలపై వారి ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భూదాకూర్థ్, సోమగూడెం – భారీ ఓటర్లు..
గ్రామాల వారీగా ఓటర్ల సంఖ్య పరిశీలిస్తే, పోటీ తీవ్రత ఎక్కువగా ఉండే గ్రామాలు స్పష్టమవుతున్నాయి. మండలంలో భూదాకూర్ గ్రామ పంచాయతీ 2,793 ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారీ ఓటర్లు గల గ్రామాలు: భూదాకూర్ (2,793), సోమగూడెం (2,408), చాకెపల్లి (1,913), పాత బెల్లంపల్లి (1,905), బట్వానపల్లి (1,755) గ్రామాల్లో ఎన్నికల హోరు మరింత ఎక్కువగా ఉంది. అత్యల్ప ఓటర్లు గల గ్రామాలు: అదే సమయంలో లింగాపూర్ (461), దుగినపల్లి (493), బుచయ్యపల్లి (597) వంటి గ్రామాలు అత్యల్ప ఓటర్లతో ఉన్న పంచాయతీలుగా నమోదయ్యాయి.
త్రిముఖ, చతుర్ముఖ పోటీ ఖాయం…
ఈ సారి మండల వ్యాప్తంగా పోటీ మరింత కఠినంగా మారింది. మొత్తం 17 సర్పంచ్ స్థానాలకు గాను 52 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలబడగా, 339 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సంఖ్యలు చూస్తే చాలాచోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధిక ఓటర్లున్న భూదాకూర్ధ్, సోమగూడెం, పాత బెల్లంపల్లి, చాకెపల్లి వంటి పెద్ద గ్రామాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు కోసం పోటీ తీవ్రత పెరిగింది.
37 పోలింగ్ బూతులు..
పోలింగ్ సాఫీగా జరిగేందుకు అధికారులు మండలంలో మొత్తం 37 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. వీటిలో భూదాకూర్ (6), ఆకెనపల్లి (3), అంకుశం (3), బట్వానపల్లి (3), కన్నాల (3), పాత బెల్లంపల్లి (3) గ్రామాల్లో అధిక పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే మిగిలిన గ్రామాల్లో 1 లేదా 2 బూతులు ఏర్పాటు చేశారు.
పోలింగ్ సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, రవాణా సదుపాయాలు, ఎలక్ట్రానిక్ పరికరాల పంపిణీ వంటి అన్ని పనులు వేగంగా పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ప్రచార హోరు గరిష్ట స్థాయికి..
పోలింగ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచారానికి చివరిరోజైన శుక్రవారం ప్రచారానికి ఊపు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలలో ఇంటింటికీ తిరిగే ప్రచారం, ఆటో రిక్షా ప్రకటనలు, హ్యాండ్బిల్లుల పంపిణీ ఉత్సాహంగా సాగాయి. అదేవిధంగా, యువతరం ఎక్కువగా ఉన్న మండలంగా పేరున్న బెల్లంపల్లిలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై ప్రచారం కూడా ఊపందుకుందుకుంటుంది. అభ్యర్థుల హామీలు, మద్దతుదారుల వాదనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
పోలింగ్ శాతం పెరిగే సూచనలు
స్త్రీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం , ఎక్కువ గ్రామాల్లో హోరాహోరీ పోటీలు నెలకొనడం వల్ల ఈసారి పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూదాకూర్ధ్, సోమగూడెం, పాత బెల్లంపల్లి వంటి పెద్ద గ్రామాల్లో పోలింగ్ రోజు ఉదయం నుంచే రద్దీ కనిపించే అవకాశం ఉంది.
గ్రామాల్లో మారుమోగుతున్న ప్రచార నినాదాలు, ఓటర్లతో మాట్లాడుతున్న అభ్యర్థులు, రాత్రివేళలు కూడా కనిపిస్తున్న ఎన్నికల శబ్దాలు… బెల్లంపల్లి మండలం పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. డిసెంబర్ 14న జరగనున్న పోలింగ్‌తో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల హోరు తారాస్థాయికి చేరనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టుతారో వేచిచూడాల్సిందే మరి.

