దాచేపల్లి, ఆంధ్రప్రభ : ఏపీలో గ్రానైట్ స్మగ్లింగ్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ అక్రమ గ్రానైట్ తరలింపులకు వేదికగా మారింది. దీనిని అడ్డుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు.ఏపీ–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామం సమీపంలో సేల్ ట్యాక్స్ అధికారుల టీమ్‌లు రంగంలోకి దిగాయి. వాహనాలను తనిఖీలు చేసేందుకు ఉపక్రమించారు. కొన్ని లారీలు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిని అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
లారీడ్రైవర్లు మాత్రం అధికారుల లెక్కచేయలేదు. అధికారులు, లారీ డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి విషయాన్ని చేరవేశారు. స్పందించిన పల్నాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు అధికారులు, ఇటు పోలీసులు కలిసి గ్రానైట్ స్మగ్లింగ్ పాల్పడుతున్న 14 లారీలను సీజ్ చేయగా, మరో మూ లారీల డ్రైవర్లు తమ వాహనాలతో తెలంగాణ వైపు పారిపోయారు. అధికారులు స్వాధీనం చేసుకున్న లారీలను దాచేపల్లి మార్కెట్ యార్డుకు తరలించారు.