నందిగామలో పీ 4 చరిత్ర
నిరుపేదకు ఆటోతో భరోసా
కేసీపీ ఉదారత..
బ్యాంకు ఆర్థిక సాయం
ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ మహానందం
(ఆంధ్రప్రభ, నందిగామ టౌన్)
సీఎం చంద్రబాబు సంకల్పం స్వర్ణాంధ్ర సాకారానికి.. పేదరికం లేని సమాజం కీలకం.. ఈ నేపథ్యంలోనే పేదలు అన్ని విధాలా ఎదిగేందుకు చేపట్టిన పీ4 ఓ యజ్ఞంలా అమలవుతోందని.. జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ ఆర్‌డీవో కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ.. కేసీపీ ప్రతినిధులతో కలిసి ముప్పాళ్లకు చెందిన కోట వెంకటరత్నం బంగారు కుటుంబానికి ఆటో అందజేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పీ4 అమలవుతోందని.. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు లక్ష బంగారు కుటుంబాలు ఉన్నాయని.. ఇప్పటికే 6,400 మంది మార్గదర్శులు ముందుకొచ్చారన్నారు. కుటుంబాల ఆర్థికాభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో చేయూత అందిస్తున్నారని వివరించారు. అశ్రితులకు వైద్య సేవలు, విద్యా సేవలు, నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు.. ఇలా వివిధ మార్గాల్లో సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ముప్పాళ్ల కు చెందిన బంగారు కుటుంబ సభ్యుడు రోజంతా కష్టపడి సంపాదించినదంతా ఆటో అద్దెకే సరిపోతుందని.. అందుకే మార్గదర్శి ద్వారా ఆటోను సమకూర్చినట్టు తెలిపారు. 60 శాతం మొత్తాన్ని కేసీపీ అందించిందని, మిగిలిన 40 శాతం మొత్తం బ్యాంకు రుణంగా ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ఇక రోజుకు రూ. 700- రూ. 800 వరకు ఆదాయం వస్తుందని, దీంతో ఆ బంగారు కుటుంబానికి ఆర్థిక సాధికారత సొంతమవుతుందన్నారు. ఇప్పటికే వెంకటరత్నం గుండె శస్త్రచికిత్సకు కూడా సాయమందించినట్టు తెలిపారు. ఎందరో పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు తాము కూడా మార్గదర్శులుగా బంగారు కుటుంబాలకు చేయూత ఇస్తామని ముందుకు రావటంతో ఆనందం కలుగుతోందన్నారు. సమాజం వెన్నుదన్నుతో ఎదిగాం.. సమాజం ఎదుగుదలకు తమవంతు భాగస్వామ్యం అందించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావొచ్చని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, కేసీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.మధుసూదనరావు పాల్గొన్నారు.

