Oval Test | తొలి సెష‌న్ ఇంగ్లాండ్ దే.. గిల్-సుధర్శన్ ఫైట్‌బ్యాక్ !

లండన్, ద ఓవల్ : భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య ఐదవ టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో.. ఆటకు వ‌రుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో లంచ్ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించాల్సి వచ్చింది. వర్షం కురవడం ప్రారంభించిన వెంటనే ఆటగాళ్లు డ్రెస్‌రూమ్‌లకు వెళ్లగా, మైదాన సిబ్బంది వెంటనే కవర్స్‌తో మైదానాన్ని కప్పేశారు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్, మేఘావృత వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత జట్టు బ్యాటింగ్ తో బ‌రిలోకి దిగ‌గా… ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ జట్టులోకి తిరిగి వచ్చిన గస్ అట్కిన్సన్ నాలుగో ఓవర్‌లో యషస్వి జైస్వాల్‌ (2)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి ఇంగ్లండ్‌కు తొలి బ్రేక‌థ్రూ అందించాడు.

ఆ తర్వాత కేఎల్ రాహుల్‌కు జోడీగా బి సాయి సుధర్శన్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ స్వింగ్ బంతులను జాగ్రత్తగా ఎదుర్కొంటూ డ్రింక్స్ బ్రేక్ దాకా నిలబడ్డారు. భాగస్వామ్యం కొంత స్థిరపడుతున్న వేళ, క్రిస్ వోక్స్ కీలక వికెట్ తీసాడు. రాహుల్‌ (14) ప‌రుగుల వ‌ద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు.

అనంతరం భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కొన్ని అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్ స్కోరు 72/2గా ఉంది. సుధర్శన్ 25, గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండు కీలక వికెట్లు కోల్పోయినా, భారత్ పుంజుకుంటుండగానే వర్షం ఆటను నిలిపివేసింది.

Leave a Reply