మంత్రి మందలించినా మారని తీరు..!

మంత్రి మందలించినా మారని తీరు..!
- హుస్నాబాద్ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి హల్చల్
- కార్మికులపై వేధింపుల ఆరోపణలు
హుస్నాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర రవాణా శాఖకు మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహిస్తున్నప్పటికీ, ఆయన సొంత నియోజకవర్గంలోని హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో పరిస్థితులు మారడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 16న ‘హుస్నాబాద్ ఆర్టీసీలో షాడోబాస్’ శీర్షికతో ఆంధ్రప్రభలో వచ్చిన కథనంపై అధికారులు విచారణ జరిపి మందలించినప్పటికీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగి వ్యవహార శైలిలో మార్పు లేదని ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా పని భారం పెరిగినా అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు సరైన గుర్తింపు దక్కడం లేదని వారు వాపోతున్నారు. ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి మాటలను నమ్మి తమపై మానసిక, శారీరక ఒత్తిడి తీసుకువస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
అన్యాయంగా బలి చేస్తున్నారంటూ డ్రైవర్ ఆవేదన..
గత 15 ఏళ్లుగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నానని ఒక ఉద్యోగి తెలిపారు. గత డిసెంబర్ 24న తన కుమార్తె ఆరోగ్య సమస్యపై ఇంటి నుండి అత్యవసర కాల్ రావడంతో ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై పత్రికలో వార్త రావడంతో డిపో మేనేజర్ మందలించి, డిపో స్పేర్ చేసి వరంగల్ ట్రైనింగ్‌కు పంపారని చెప్పారు. ఈ సమయంలో ఔట్సోర్సింగ్ ప్యాసింజర్ గైడ్‌గా పనిచేస్తున్న వ్యక్తి వచ్చి బెదిరింపులకు పాల్పడి డిపో స్పేర్‌కు పంపాడని ఆరోపించారు.
అంతేకాకుండా ఇంక్రిమెంట్ నిలిపివేయకుండా ఉండేందుకు రూ.30 వేలు ఇవ్వాలని చెప్పాడని, చివరకు రూ.25 వేలు నగదు ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ రెండు నెలల తరువాత ఒక సంవత్సరం ఇంక్రిమెంట్ నిలిపివేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా వాగ్వాదం జరిగిందని చెప్పారు. ఈ అంశంపై డిపో మేనేజర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంకు లావాదేవీలపై విచారణ జరిపితే నిజాలు బయటపడతాయని అన్నారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగి వర్సెస్ ఆర్టీసీ కార్మికులు..

గత 30 ఏళ్లుగా ఆర్టీసీలో పనిచేస్తున్న మరో కార్మికుడు మాట్లాడుతూ.. సంస్థకు సంబంధం లేని వ్యక్తి బెదిరింపులు చేస్తూ అజమాయిషి చేయడం బాధాకరమని తెలిపారు. బస్సు రూట్ల మార్పులు, సిబ్బందిపై అవమానకర ప్రవర్తన, ఫిర్యాదులు చేయించి తానే పరిష్కరించినట్లు చూపించడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అలాగే విద్యార్థులకు బస్ పాస్‌ల విషయంలో కూడా తనను ఆశ్రయించిన వారికే సహాయం చేస్తానని చెప్పడం, విద్యార్థులను భయపెట్టేలా మాట్లాడడం జరుగుతోందని కార్మికులు పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి తీరుతో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని, తమ వ్యక్తిగత గౌరవం కూడా దెబ్బతింటోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
