అనోరా చిత్ర కథ ఏంటంటే..
ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకల్లో ‘అనోరా’ అనే రొమాంటిక్ చిత్రం పేరు మార్మోగిపోయింది. ఆస్కార్ వేదికపై దాదాపు ఐదు విభాగాల్లో విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను అందుకుంది. ‘రెడ్ రాకెట్’, ‘ది ఫ్లోరిడా ప్రాజెక్ట్’ వంటి చిత్రాలను తీసిన సీన్ బేకర్ ‘అనోరా’కు దర్శకత్వం వహించారు. మైకీ మ్యాడిసన్ , మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది అక్టోబర్ నెలలో ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఇక అనోరా కథ విషయానికొస్తే.. ఇదో వేశ్య కథ. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలోనే దీన్ని తెరకెక్కించారు. రష్యాకి చెందిన కోటీశ్వరుడైన కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు. అక్కడ 23 ఏళ్ల వేశ్యని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. పెళ్లికూడా చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కుర్రాడి తల్లిదండ్రులు.. ఈ పెళ్లిని అంగీకరించరు. తమ కుమారుడిని రష్యాకు తీసుకెళ్లిపోతారు. దీంతో వేశ్య ఏం చేసింది..? అతడిని వదిలేస్తుందా..? అనేది మిగతా స్టోరీ. సుమారు 6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.52 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఊహించని రీతిలో 41 మిలియన్ డాలర్లు (మన భారత కరెన్సీలో దాదాపు రూ.358కోట్లు) అందుకుని కలెక్షన్లలో రికార్డులు సృష్టించిందీ చిత్రం.
ఇక విడుదలకు ముందే ఈ చిత్రం పలు అవార్డులు, రివార్డులు అందుకుంది. 2024 మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు కేన్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పామ్ డి ఓర్’ అవార్డును సీన్ బేకర్ అందుకున్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా-2024లో కూడా అనోరా చోటు దక్కించుకోవడం విశేషం. రెండు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌నూ అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.