Operation Sindoor | ఆర్మీ నోట.. కోహ్లీ ఆట..

ఢిల్లీ : ఆపరేషన్‌ సిందూర్‌ పై రక్షణశాఖ అధికారులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ మాట్లాడుతూ.. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారు. మన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సామర్థ్యాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్లు జెఫ్‌ థామ్సన్‌, డెనిస్‌ లిల్లీ ద్వయంతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఎంతోమంది అభిమానుల్లాగే నాక్కూడా ఆయన ఎంతో ఇష్టమైన క్రికెటర్‌. అందువల్ల క్రికెట్‌ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. 1970ల్లో నేను స్కూల్‌ రోజుల్లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య ఓ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ సమయంలో ఆసీస్‌ మేటి బౌలర్లు జెఫ్‌ థామ్సన్‌, డెనిస్‌ లిల్లీ విధ్వంసం సృష్టించారు. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఊచకోత కోశారు. అప్పుడు ఆస్ట్రేలియా ఓ పద ప్రయోగం చేసింది. యాషెస్‌ టు యాషెస్‌ (బూడిదను ఉద్దేశిస్తూ ).. డస్ట్‌ టు డస్ట్‌.. థామ్సన్‌కి దొరక్కపోతే.. లిల్లీకి చిక్కాల్సిందే అని పేర్కొంది. ఇప్పుడు పాకిస్థాన్‌పై పోరులో భారత్‌ ఆధిపత్యాన్ని అలాగే అభివర్ణించొచ్చు అని లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ పేర్కొన్నారు.


మా పోరాటం ఉగ్రవాదులపైనే.. పాక్‌ నష్టానికి బాధ్యత వారిదే: రక్షణశాఖ

మన గగనతల రక్షణ వ్యవస్థలోని దశలను చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. శత్రువులు ఎన్ని హద్దులు దాటి వచ్చినా.. ఈ గ్రిడ్‌ సిస్టమ్‌లోని ఒక లేయర్‌ వారిని నాశనం చేస్తుంది. మన ఎయిర్‌ డిఫెన్స్‌ అంత శక్తిమంతమైనది, విలువైనది అని రాజీవ్‌ ఘాయ్‌ వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్ లో మన త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. వందల కి.మీ దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. అయితే, తమ పోరు ఉగ్రవాదంపైనే అని, అనవసరంగా పాక్‌ ఆర్మీ ఇందులో జోక్యం చేసుకుంద పేర్కొన్నారు.

Leave a Reply