గత రాత్రి నుంచి ఆగని ఫైరింగ్
లొంగిపోవాలని బస్తర్ ఐజీ హెచ్చరికలు
చంపొద్దు, కాల్పులు జరపొద్దంటున్న మానవ హక్కుల సంఘాలు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : (central desk )
7 జులై 2025 సోమవారం సాయంత్రం..
దాదాపు ఏడు గంటల సమయం
ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతం
30 వేల మంది కేంద్ర పోలీసు బలగాలు, ఛత్తీస్‌గఢ్ (chattisgarh ) రాష్ట్ర పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఏకబిగిన కాల్పులు (firing ) ప్రారంభించారనే సమాచారం అంతటా కలకలం సృష్టించింది. మావోయిస్టులు (maoists ) లొంగిపోవాలని, లేదా చావుకు సిద్ధం కావాలని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు కీలక నేతలు గణపతి (ganapati ) , హిడ్మ (hidma ) తమకు దొరికినట్టేనని భద్రత దళాలు భావిస్తున్నట్టు సమాచారం. సరీగా ఇదే స్థితిలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు , పౌర హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలు, మేధావులు ఈ మారణహోమాన్ని ఆపాలని. ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించాలని… పౌర హక్కుల సంఘం నేత జి హరగోపాల్ (prof . haragopal ) ఓ ప్రకటన జారీ చేశారు. అంతే కాకుండా పోలీసులు చట్టం, రాజ్యాంగం ప్రకారం మెదలకుండా , హత్యలు చేయడం, చంపేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కాల్పులు నిలిపివేయడానికి అన్ని వర్గాలు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేయటంతో… ఇప్పటి వరకూ ఎన్ఐఏ, రా దర్యాప్తు సంస్థలకూ చిక్కని, దొరకని మావోయిస్టు నేత గణపతి కేంద్రబలగాలకు దొరికిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే, హిడ్మా , దేవా సంగతేంటీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కటం లేదు.
గణపతి ఎందుకు టార్గెట్ ..
కరీనగర్ జిల్లా సారంగపూర్‌కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) నేతృత్వంలోనే భారత దేశంలో మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున విస్తరించింది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసా చర్యలకు గణపతి వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు.
పార్టీ విస్తరణలో కీలకం..
13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్.ఐ.ఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. 2018 నవంబర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకు రాజీనామా చేశారు. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల్లో వందలాది కేసులు ఉన్నాయి. 45 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాన్ని గణపతి నడిపారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లిన అగ్రనేతల్ని వరుసగా మట్టుబెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కీలక నేత గణపతినే టార్గెట్ చేసింది. ఇక కీలక మావోయిస్టు నాయకులు మాడవి హిడ్మా, దేవా కూడా ఈ కాల్పుల్లో చిక్కుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చంపొద్దు.. అరెస్టు చేయండి
మావోయిస్టులు సజీవంగా దొరికితే వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ పెసా, అడవి, చట్టాలను కాల రాస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టు పట్టుబడి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పరచాలన్నారు. వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని పౌర హక్కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు డిమాండు చేశారు.