అలా చేస్తేనే.. శాశ్వత విముక్తి..

అలా చేస్తేనే.. శాశ్వత విముక్తి..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మౌలానా అబుల్ కలాం చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పని చేసి దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలనే ఆశయంతో కుల,మత బేధాలు లేకుండా పని చేశారని కొనియాడారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992 లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీ విద్య పై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేసి మైనారిటీ బాలికల విద్య పై ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక్కడ అన్ని కులాలు, వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ శాఖ అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply