Ongole | పుస్తక పఠనమే ఉత్తమం..

Ongole | పుస్తక పఠనమే ఉత్తమం..
Ongole, ఆంధ్రప్రభ బ్యూరో : మేధో వికాసానికి పుస్తక పఠనమే ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు (Collector P.Rajababu) చెప్పారు. అందుకే విద్యార్థులు అందరూ సెల్ఫోన్ వదిలి పుస్తకంతో సహవాసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలులోని (Ongole) జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాతతో కలిసి ముందుగా సరస్వతి దేవి విగ్రహానికి, అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్ లాల్ నెహ్రూ (Nehro) చిత్రపటానికి కూడా వారు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పుస్తకాలు చదవడాన్ని చిన్ననాటి నుంచే ఒక అలవాటుగా మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగానే గ్రంథాలయాలను రాష్ట్ర ప్రభుత్వం (State Govt) అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విజ్ఞాన సమాజ ఆవిష్కరణ కోసం గ్రంథాలయాలను జ్ఞాన సముపార్జన కేంద్రాలుగా చేస్తున్నట్లు తెలిపారు. అవకాశం ఉన్న వారందరూ గ్రంధాలయాలకు వచ్చి పుస్తకాలు చదవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జ్ఞానాన్ని తిరిగి సమాజానికి అందించడంలోనూ భాగస్వాములు కావాలని ఆయన చెప్పారు.
మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పుస్తకాలే ప్రియమైన నేస్తాలు అని చెప్పారు. పుస్తక పఠన అవశ్యకతను, స్వాతంత్ర్య పోరాటంలో గ్రంధాలయోద్యమం పోషించిన పాత్రను భావితరాలకు తెలియజేసేలా ప్రభుత్వం ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శివారెడ్డి, కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
