రూ.60 లక్షలతో నిర్మాణం..
మహిళలకు రక్షణ పునరావాసం
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : నంద్యాల జిల్లాకు వన్ స్టాప్ సెంటర్ మంజూరైందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ (Ap Minister NMD Farook) పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవనానికి (One Stop Building) మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి కలిసి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్” పథకం కింద దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, సహాయం, పునరావాసం కోసం సెంటర్లను ఏర్పాటు చేస్తోందని, ప్రస్తుతం నంద్యాల జిల్లా కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నంద్యాల వన్ స్టాప్ సెంటర్ నిర్మాణానికి రూ. 60 లక్షల నిధులు కేటాయించగా, నిర్మాణ బాధ్యతను ఏపీఎంఎస్ఐడీసీ (APMSIDC) ఏజెన్సీకి అప్పగించామని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా బాధిత మహిళలు మరియు బాలికలకు ఆరోగ్య సేవలు, న్యాయ సలహాలు, చట్టపరమైన సహాయం, మానసిక కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి వంటి ఐదు రకాల సమగ్ర సేవలను ఒకే చోట అందించనున్నట్లు వివరించారు.
వన్ స్టాప్ సెంటర్ లక్ష్యం మహిళలపై జరిగే హింసా సంఘటనలలో బాధితులకు తక్షణ సహాయం అందించడం, వారికి మానసిక ధైర్యం, చట్టపరమైన రక్షణ, మరియు అవసరమైన వైద్యసహాయం అందించడమేనని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బాధిత మహిళల తరలింపు మరియు అత్యవసర సేవల నిమిత్తం ఉపయోగించే వాహనానికి మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ అధికారి లీలావతి, జిల్లా అధికారులు, మహిళా సంక్షేమ విభాగ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

