నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ప్రాంతంలోని అరటి తోటలో మంటల్లో ఒక వ్యక్తి సజీవదహనమై శవంగా పడి ఉన్న దృశ్యం కనపడింది. మనిషి శరీరం పూర్తిగా కాలుతున్న విషయం అక్కడున్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అరటి తోటలో వ్యక్తి అనుమానాస్పద మృతి సంఘటనపై పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. శరీరం మొత్తం కాలిపోయి పొగ శరీరం నుంచి వస్తూ ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉంటుందన్నారు.
అతని మెడలో ఆంజనేయ స్వామి తాయత్తు ఉందని, అతని కుడి కాలికి నల్లటి దారం ఉందని తెలిపారు. నంద్యాల డి.ఎస్.పి మందా జావలి తెలిపిన వివరాల మేరకు… ఆ వ్యక్తి సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు వివరాలు అందించాలని, అందుకు మహానంది ఎస్సై, బండి ఆత్మకూరు ఎస్సైలకు వివరాలు తెలపాలని ఆమె కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సంఘటనపై మహానంది ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు మొదలయ్యాయని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.