ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్
నారాయణపేట ప్రతినిధి,అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ ) ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామంను మోడల్ సోలార్ విలేజ్‌గా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో మరికల్ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా ఎంపిక చేస్తూ తీర్మానం ఆమోదించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం, ఎంపిక అర్హత పొందడానికి 5000 మందికి పైగా జనాభా కలిగిన రెవెన్యూ గ్రామం అయి ఉండాలని ఆమె వివరించారు. నారాయణపేట జిల్లాలో ఈ ప్రమాణాల ప్రకారం మొత్తం 9 గ్రామాలు పోటీలో పాల్గొన్నాయని, అందులో మరికల్ గ్రామం గరిష్ట సౌర సామర్థ్య వినియోగాన్ని నమోదు చేసుకొని ఎంపికైనట్లు వెల్లడించారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్.. మరికల్ గ్రామం, మండలాన్ని DM/TGREDCO మరియు SE/TGSPDCL అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. మోడల్ సోలార్ విలేజ్ మార్గదర్శకాల ప్రకారం గ్రామాన్ని సౌరశక్తితో కూడిన ఆదర్శ గ్రామంగా మార్చేందుకు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయాలని సూచించారు. ఆమె తెలిపిన ప్రకారం, DPR ఆమోదం పొందిన తర్వాత ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు పూర్తిగా అమలవ్వాలి, దాని పర్యవేక్షణ బాధ్యతను జిల్లా స్థాయి కమిటీ క్రమం తప్పకుండా నిర్వర్తిస్తుంది. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, ఎల్.డి.ఎం విజయ్ కుమార్, రెడ్కో డీఎం మనోహర్ రెడ్డి, ట్రాన్స్‌కో డి.ఈ. నరసింహ రెడ్డి, డిపిఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

