HYD | కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఒకరు మృతి

హైద‌రాబాద్ : కూక‌ట్‌పల్లి (Kukatpally) కల్తీ కల్లు ఘటనలో ఒకరు మృతి చెందారు. మంగ‌ళ‌వారం క‌ల్తీ క‌ల్లు తాగ‌టం వ‌ల్ల మొత్తం 16 మంది అస్వస్థతకు (16 people fell ill) గురైన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుడు హైద‌ర్‌న‌గ‌ర్ శ్రీరామ్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన తుల‌సి రామ్ (Tulsi Ram) (47)గా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బాధితులంతా నిరుపేద కూలీలుగా సమాచారం. కల్లు తాగిన అనంతరం విరేచనాలు అవ్వడం, లో బీపీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మొదట బాధితులను రాందేవ్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుండి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిమ్స్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Leave a Reply