PAKISTHAN| ఇలా జరుగుతుందని ముందే తెలుసు

PAKISTHAN| ఇలా జరుగుతుందని ముందే తెలుసు
- బాయ్‌కాట్ చేసినా బలవంతం చేశారు
- భారత్ చేతుల్లో చిత్తైన పాకిస్తాన్‌పై..
- సోషల్ మీడియాలో ట్రోల్స్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భారత్ చేతిలో పాకిస్థాన్ చావుదెబ్బ తిన్నది. ఐసీసీ టోర్నీలో ఇండియాపై గెలవలేమని పాక్ తెలుసు. ఇది తెలిసే భారత్‌తో మ్యాచ్ ఆడమని పాక్ నెత్తినోరు కొట్టుకుంది. అయినా వినకుండా భయపెట్టి బలవంతంగా భారత్‌తో మ్యాచ్ ఆడించారు. చివరికి ఏమైంది సేమ్ సీన్ రిపీట్. ఎప్పటిలాగానే భారత్ చేతిలో పాక్ చిత్తయ్యింది. భారత్ దెబ్బకు.. పాక్ అబ్బా అనాల్సి వచ్చింది. ఈ దారుణ ఓటమిని పాక్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ అభిమానులైతే రెచ్చిపోయి తమ దేశ ఆటగాళ్లను తిట్టిపోస్తున్నారు. ఓడిపోతామనే ముందస్తుగా భారత్‌తో మ్యాచ్ ఆడమని చెప్పాం.. అయినా బలవంతంగా ఆడించారు. ‘మరి ఇలాంటిదేదో జరుగుతుందనే తెలిసే.. బాయ్‌కాట్ అన్నాం… ఫైన్ కట్టాలని భయపెట్టి మ్యాచ్ ఆడించి, ఇలా చిత్తుగా ఓడించడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయండీ’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. టీమిండియాకి కనీస పోటీ ఇవ్వలేకపోయిన పాకిస్తాన్.. పాక్ కంటే యూఎస్ఏ టీమ్, టీమిండియాతో మ్యాచ్‌లో బాగా ఆడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాక్ మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు పెద్ద హైడ్రామానే నడిచింది. బంగ్లాదేశ్, ఇండియా నుంచి మ్యాచులను శ్రీలంకకి మార్చాలని డిమాండ్ చేసి, ఐసీసీ ఒప్పుకోకపోవడంతో టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. దీనికి ఏ మాత్రం సంబంధం లేని పాకిస్తాన్, తాము టీమిండియాతో మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ ఖరాకండిగా చెప్పడంతో భయంతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది.

అదే రోజు.. సేమ్ రిజల్ట్..
2003 మహాశివరాత్రి రోజున సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు, పాకిస్తాన్‌ని ఓడించింది. మళ్లీ 23 ఏళ్లకు కొలంబోలో భారత్, పాకిస్తాన్‌ని మహాశివరాత్రి రోజునే ఓడించింది. 2015, ఫిబ్రవరి 15న ఆడిలైడ్‌లో పాకిస్తాన్‌పై గెలిచిన భారత్, మళ్లీ 11 ఏళ్లకు 2026, ఫిబ్రవరి 15నే కొలంబోలో పాక్‌పై విజయాన్ని అందుకుంది. అప్పుడు సచిన్ శివతాండవం చేయగా.. ఇప్పుడు ఆ బాధ్యత ఇషాన్ కిషన్ తీసుకున్నాడు. పాక్ బౌలర్లను ఇషాన్ ఓ ఆట ఆడుకున్నాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు ఈ విధ్వంసక ఓపెనర్.
పార్ట్‌టైమ్ బౌలర్లతో బౌలింగ్..పాక్ బ్యాటింగ్ దారుణం
పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించాడని టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో కెప్టెన్ బౌలింగ్ చేయించాడని గుర్తు చేశాడు. తద్వారా సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌ను కొంచెం పొడిగించాడని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పాడని అన్నాడు. ఏ విషయంలో కూడా భారత్‌తో పాకిస్థాన్‌కు పోలిక లేదని అన్నాడు.
వారిని పక్కన పెట్టండి..
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌లను తదుపరి మ్యాచ్‌లకు పక్కన పెట్టాలని డిమాండ్ చేశాడు. వరుస వైఫల్యాల తర్వాత కూడా సీనియర్లనే నమ్ముకోవడం సరికాదని, యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు.
పాకిస్తాన్‌కి ఇక చావో రేవో..
టీమిండియా చేతుల్లో 61 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పాకిస్తాన్ నెట్ రన్ రేటుపై తీవ్రంగా ప్రభావం పడనుంది. ఇప్పటికే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి, గెలిచి ఊపిరి పీల్చుకుంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్, సూపర్ 8 చేరుకోవాలంటే ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై భారీ విజయం అందుకోవాల్సి ఉంటుంది. నమీబియా షాక్ ఇస్తే, పాక్ గ్రూప్ స్టేజ్ నుంచి తప్పుకుంటుంది.
