ఆంధ్రప్రభ, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) – సర్దార్ గౌతు లచ్చన స్ఫూర్తితో బారువా బీచ్‌ను ప్రత్యేక చర్యలతో మరో గోవా తరహాలో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని సుందర బారువ సాగర తీరంలో మే 2, 3 తేదీల నుంచి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బారువా తీరం ఒక అద్భుత వేడుకకు వేదిక కానుందని, ఇది రెండో గోవా రీతిలో తలపించేట్టుగా అన్ని రకాల హంగులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. స్థానికుల సహకారంతో ప్లాస్టిక్ రహిత బీచ్‌గా తీర్చిదిద్ది, అన్ని రాష్ట్రాల ప్రజలకు గొప్ప పర్యాటక కేంద్రంగా బారువ సముద్రతీరాన్ని తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

ప్లాస్టిక్ రహితంగా చేస్తే మరింత అభివృద్ది..
స్థానిక ప్రజలు ప్లాస్టిక్ రహిత బీచ్‌గా తీర్చిదిద్దినప్పుడే ఈ ప్రాంతానికి సీఎం చంద్రబాబుని తీసుకువచ్చి అన్ని విధాలుగా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. ఉదయం ఒలివ్ రిడ్లీ తాబేలు ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టి ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ కార్యకర్తలకు ప్రత్యేక అనుభూతిని పరిచయం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సాగర తీరంలో పండుగ సందడి
ఫ్రమ్ షోర్ టూ సీ – ఏ జర్నీ టూ సెలెబ్రేట్ అనే స్ఫూర్తిదాయక నినాదంతో బీచ్ లోపల ఆటలు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతరించిపోతున్న ఒలివ్ రిడ్లీ తాబేళ్ల ప్రాముఖ్యతను ప్రజా ప్రతినిధులు అధికారులు వివరించారు. ఈ ఉత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని భావితరాలకు అందించే అడుగని జీవావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంప్రదాయ పడవ పోటీల్లో లోకల్ మత్స్యకారులు నైపుణ్యాన్ని చాటుకున్నారు. బీచ్ వాలీబాల్ పోటీలు ఉత్సాహాన్ని నింపాయి. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు తీరంలో ప్లాస్టిక్ కవర్లు, చెత్తను సేకరించి ప్లాస్టిక్ రహిత సముద్రతీరంగా తీర్చిదిద్దాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.