రూ. 3 లక్షల బంగారు గాజులు అపహరణ
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణంలోని నీలి వీధిలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఒంటరిగా ఉన్న ఇందిరమ్మ (60) కత్తితో బెదిరించి, హింసించి మూడు లక్షల రూపాయల విలువైన బంగారు గాజులను దుండగురాలు అపహరించుకుపోయిందని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బురఖా ధరించిన ఓ మహిళ ఏకాంతంగా ఉన్న వృద్ధురాలు ఇందిరమ్మ ఇంటికి వచ్చి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఆమెను కత్తితో బెదిరించడమే కాక, ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రతిఘటించిన వృద్ధురాలిని కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకుంది.

దాదాపు రూ. 3 లక్షల విలువైన బంగారు గాజులు దోచుకున్న అంగతకురాలు వెంటనే అక్కడి నుంచి పరారైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, వృద్ధురాలి పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన ఇందిరమ్మను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బురఖా ధరించిన మహిళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నీలి వీధిలో పట్టపగలు దోపిడీ సంఘటన తెలుసుకొని నంద్యాల వాసులను భయాందోళనకు గురిచేసింది. నాలుగు రోజుల క్రితం బైర్ మల్ వీధిలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ వ్యక్తి దారిలో వెళ్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి పోయిన సంఘటన జరిగింది. ఇది చోరీ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వన్ టాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.