పట్టించుకోని అధికారులు..
జైనూర్/ ఉట్నూర్, ఆంధ్రప్రభ : రోడ్ల అభివృద్ధికి ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) చెబుతున్నా కొత్త రోడ్లకు, ఏళ్ల తరబడి వేసిన మరమ్మత్తులేని రోడ్లకు నిధులు కేటాయించక గుంతల మయం రోడ్లతో ప్రయాణికులు, ప్రజలు నరకయాతన పడుతున్నారు. అదిలాబాద్(Adilabad), కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని ఆర్ అండ్ బి ప్రధాన రోడ్లు, గ్రామీణ ప్రాంత బీటి రోడ్లు గుంతలమయంతో అధ్వానంగా తయారయ్యాయి.
ఆసిఫాబాద్ నుండి జైనూర్, ఉట్నూర్ వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా భారీ వర్షాలకు గుంతల మయంగా ఏర్పడి అద్వానంగా తయారయింది. ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఆ రోడ్డు కనీసం మరమ్మతులు చేయించలేకపోవడంతో సంవత్సరాల తరబడి రోజు నిత్యం ఆ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఊరుటూర్ నుండి మంచిర్యాల(Mancheryala) వైపు వెళ్లే ప్రధాన రోడ్డు అక్కడక్కడ అద్వానంగా మారింది. సమీపంలో రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు గుంతలమయంతో అధ్వానంగా తయారైంది.
దీంతో రోజు వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్లపై వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆ రోడ్లపై ప్రయాణం చేయడానికి నరకయాతన పడుతున్నామని ప్రయాణికులు, వాహనదారులు పేర్కొంటున్నారు. వాహనాల ద్వారా ప్రభుత్వం ట్యాక్సీలు వసూలు చేస్తున్నా కనీసం ప్యాచ్ వర్క్(patch work) కూడా చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వాహనదారులు పేర్కొంటున్నారు. వాహన దారులు, ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నా అధికారులకు, ప్రజాప్రతితులకు కనిపించడం లేదని మండిపడుతున్నారు.


