IND vs ENG | నేడే రెండో వన్డే.. రెట్టింపైన ఉత్సాహంతో బరిలోకి భార‌త్

తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య కటక్‌ వేదికగా రెండో వన్డే జరగనుంది.

ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకున్న ఆతిథ్య భారత్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ను 4 వికెట్లతో చిత్తు చేసిన టీమిండియా కటక్‌ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది.

గత మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోరు కటక్‌ వన్డేలోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు రెడీగా ఉంది.

తప్పిదాల నుంచి గుణపాఠాలు..

ఓటమితో ఈ సిరీస్‌ను ఆరంభించిన ఇంగ్లిష్‌ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని ఇంగ్లండ్‌ సారథి జోస్‌ బట్లర్‌ పేర్కొన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది.

కోహ్లీ ఇన్‌..

గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కటక్‌ మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని భారత వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వెల్లడించాడు. దీంతో నేటి మ్యాచ్‌లో కోహ్లీ బరిలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. అయితే అతడు వస్తే జట్టు నుంచి ఎవరు బయటకెళ్తారో ప్రశ్నార్థకంగా మారింది.

కోహ్లీ గైర్హాజరీలో చివరి నిమిషంలో శ్రేయస్‌ అయ్యర్‌ను తుది జట్టులో తీసుకున్నారు. అనుకోకుండా జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్‌ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అటు మాజీలతో పాటు ఇటు అభిమానులు సైతం శ్రేయస్‌ను తర్వాతి మ్యాచుల్లోనూ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు.

దీంతో ఇప్పుడు కోహ్లీ కూడా కోలుకోవడంతో ప్లేయింగ్‌-11లో ఎవరిని ఆడించాలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

జట్ల వివరాలు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌/యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌/రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ/అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, కుల్దిdప్‌ యాదవ్‌/వరుణ్‌ చక్రవర్తి.

ఇంగ్లండ్‌: బెన్‌ డకెట్‌, ఫిల్‌ సాల్ట్‌ (వికెట్‌ కీపర్‌), జో రూట్‌, హారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జాకబ్‌ బెథెల్‌, బ్రైడన్‌ కార్స్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వూడ్‌/సాఖిబ్‌ మహమూద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *