Peddapally | 14న హైదరాబాద్ లో ఓబీసీ పోరుబాట పుస్తక ఆవిష్కరణ

పెద్దపల్లి రూరల్, జూన్ 12(ఆంధ్రప్రభ) : సీనియర్ ఐఏఎస్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (Madhya Pradesh Principal Secretary), పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది (High Court Advocate) పృధ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ ఈనెల 14న హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ (పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ) లో నిర్వహించనున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మల్క రామస్వామి, పెద్దపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎల్.రాజయ్య తెలిపారు.

పెద్దపల్లి (Peddapally) ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బ్రిటిష్ కాలం నుండి బీసీలకు, కులవృతులపై జరిగిన సామాజిక దాడి, ఆర్థిక దోపిడీ, కాకా కలేల్కర్ కమిషన్ (Kaka Kalelkar Commission) నుండి మండల్ కమిషన్, న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. పుస్తక ఆవిష్కరణ సదస్సుకు పార్టీలకు అతీతంగా ఓబీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ప్రతినిధులు, మేధావులు, అన్నివర్గాల వారు హాజరవుతున్నారని చెప్పారు.

బీసీలను చైతన్య పరిచి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముద్రించిన పుస్తక ఆవిష్కరణకు రాష్ట్రం నలుమూలల నుండి కులాలకు, పార్టీలకు అతీతంగా ఓబీసీలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సదస్సుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆలయ ఫౌండేషన్ ఇంచార్జి పరికిపండ్ల రాము, ఓబీసీ నాయకులు అనుమాల అనిల్, మేడవేన రవితేజ, అనుమాల అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply