Chandrababu | ఎన్టీఆర్ ట్రస్ట్ విజయం భువనేశ్వరి ఘనతే..

Chandrababu | ఎన్టీఆర్ ట్రస్ట్ విజయం భువనేశ్వరి ఘనతే..

  • చిన్న మొక్క నేడు మహా వృక్షమైంది..
  • ఏ రాజకీయ పార్టీకి లేని చరిత్ర..
  • విలువలతో కూడా విద్యే లక్ష్యం..
  • ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాల్లో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రభ : గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు శనివారం (డిసెంబర్ 27) అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

గండిపేట అంటేనే తనకు ఎన్నో గుర్తు లని, ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం, నేడు భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా నిలయంగా మారడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. నాడు రాజకీయ శిక్షణ జరిగిన క్లాసు రూముల్లోనే నేడు పిల్లలు చదువుకోవడం విశేషమని, 1997లో ఒక చిన్న మొక్కలా ప్రారంభమైన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, నేడు తన సతీమణి భువనేశ్వరి నాయకత్వంలో ఒక మహా వృక్షంలా విస్తరించిందని కొనియాడారు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు పెద్దదిక్కుగా నిలవాలనే సంకల్పంతో మొదలైన ఈ సంస్థ నుంచి నేడు జడ్జీలు, గ్రూప్-1 అధికారులు, ఐఐటీయన్లు రావడం ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు.

ఈ సందర్భంగా తన సతీమణి నారా భువనేశ్వరి కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు హెరిటేజ్ బాధ్యతలను, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణను భువనేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ పట్టుదలతో విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.

రాజకీయాలపై ఆధారపడకుండా నీతిగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాపారాలు ప్రారంభించామని, ఆమె పట్టుదల వల్లే నేడు ఈ సంస్థలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. కేవలం విద్య మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పది లక్షల మందికి రక్తదానం, సంజీవిని క్లినిక్స్ ద్వారా లక్షలాది మందికి ఉచిత వైద్యం, సుజల స్రవంతి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించడం వంటి అద్భుతమైన సేవలు కొనసాగుతున్నాయని వివరించారు.

దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రస్ట్ ద్వారా ఇన్ని విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవని, ఇది కేవలం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కే సాధ్యమైందని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గర్వంగా ప్రకటించారు.

2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని, అందులో తెలుగు వారు అగ్రస్థానంలో ఉండాలని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. విద్యార్థులు గ్లోబల్ నాలెడ్జ్, మోడరన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు.

నారా భువనేశ్వరి ఈ సంస్థను “వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సలెన్స్ ఇన్‌స్టిట్యూట్”గా మార్చే బాధ్యత తీసుకున్నారని, దానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత స్థానాలకు చేరుకున్నాక తిరిగి వచ్చి తమ జూనియర్లలో స్ఫూర్తి నింపాలని చంద్ర‌బాబు కోరారు.

నారా భువనేశ్వరి మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గారి ‘మానవ సేవే మాధవ సేవ’ అనే గొప్ప ఆశయమే ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పునాది అని, ఆ నినాదంతోనే తాము ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి వర్గానికి మేలు చేసేలా ఎన్టీఆర్ ట్రస్ట్ విస్తృతమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. మహిళా సాధికారత, తలసేమియా బాధితుల సేవ, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు.

Leave a Reply