ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం

ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం

కంచికచర్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రాంతంలో కురిసిన వ‌ర్షాల‌తో మున్నేరుకు వ‌ర‌ద పోటెత్తుతోంద‌ని.. ఈ నేప‌థ్యంలో మున్నేరు(Three places)తో పాటు కృష్ణాన‌దిలోని వ‌ర‌ద ప్రవాహాల‌ను నిరంత‌రం ప‌ర్యవేక్షిస్తూ అప్రమ‌త్తంగా ఉంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టర్ డాక్టర్ . జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం క‌లెక్టర్ ల‌క్ష్మీశ‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజేశేఖ‌ర‌బాబు(SV Rajesekhara Babu).. నందిగామ శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్యతో క‌లిసి కీస‌ర వంతెన వ‌ద్ద మున్నేరు వ‌ర‌ద ఉద్ధృతిని ప‌రిశీలించారు.

అనంత‌రం క‌లెక్టర్ ల‌క్ష్మీశ‌, సీపీ రాజ‌శేఖ‌ర‌బాబు వివిధ ప్రాంతాల్లో మున్నేరు వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ కృష్ణా, మున్నేరు, క‌ట్టలేరు, వైరా, పాలేరులోని ప్రవాహాల‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టామ‌ని.. మున్నేరుకు అటూ ఇటూ ఉన్న 40 గ్రామాల ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేశామ‌ని తెలిపారు. ఎవ‌రికీ ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందిలేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామ‌ని.. గ్రామ స‌చివాల‌యాలు(Secretariats), పాఠ‌శాల‌ల‌ను సిద్ధంగా ఉంచామ‌ని, ఏ ఇబ్బంది త‌లెత్తినా వెనువెంట‌నే ప్రజ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌రలించే ప్రణాళిక‌ల‌తో ముందుకెళ్తున్నామ‌న్నారు.

జాతీయ ర‌హ‌దారులు (ఎన్‌హెచ్‌), ఆర్ అండ్ బీ, ఇరిగేష‌న్‌, రెవెన్యూ, పోలీస్‌.. ఇలా వివిధ శాఖ‌ల అధికారుల బృందాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ ర‌హ‌దారుల‌కు సంబంధించి కూడా ప్రణాళిక‌లు ఉన్నట్లు క‌లెక్టర్ ల‌క్ష్మీశ వివ‌రించారు.

రైతులెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ(District Collector Lakshmi Sha) తెలిపారు… న‌ష్టాల తుది అంచ‌నాల నివేదిక‌ల‌కు అనుగుణంగా న‌ష్టపోయిన ప్రతిరైతుకూ ప‌రిహారం అందించి ప్రభుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని క‌లెక్టర్ ల‌క్ష్మీశ తెలిపారు. అన్నదాత‌ల క్షేమం, సంక్షేమం ల‌క్ష్యంగా ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప‌రిస్థితిని ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటున్నార‌ని, సూచ‌న‌లు ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి కూడా వ‌ర‌ద నీరు పోటెత్తుందోని.. ఈ నేప‌థ్యంలో బ్యారేజీకి ఎగువున‌, దిగువున ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఇప్పటికే హెచ్చరిక‌లు జారీచేశామ‌న్నారు.

Leave a Reply