6వ వార్డ్ లో మున్సిపల్ పనుల పరిశీలన

6వ వార్డ్ లో మున్సిపల్ పనుల పరిశీలన
లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య వార్డ్ సభ్యులతో కలిసి పర్యటించారు. వార్డులోని పలు వీధులను సందర్శించి స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా 6వ వార్డు కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్ వార్డులో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ కాలువలు, సి.సి. రోడ్లు, వీధి దీపాల సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు.
విన్నపాలపై సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి తమ వార్డుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్, వార్డు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మోతుకూరి రాజేశ్వరి వెంకటస్వామి, వార్డు ప్రముఖులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
