IND vs ENG | ఇక బౌల‌ర్ల‌పైనే భారం..

ఓవల్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత్ మరోసారి మెరుగైన ప్రదర్శన చేస్తూ 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్‌ ముందు 374 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఇక ఇదే ఈ సిరీస్ రిజల్ట్ ను తేల్చే కీలక ఆఖరి ఇన్నింగ్స్ కానుంది.

భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ శతకం తో మరోసారి తన ప్రతిభను చాటాడు. కేవలం 127 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్, తన టెస్ట్ కెరీర్‌లో ఆరవ శతకం నమోదు చేశాడు. టాప్ ఆర్డర్‌లోని కీలక బ్యాటర్లు తడబాటుకు గురైనా, జైస్వాల్ మాత్రం జట్టును గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాత ఆకాశ్ దీప్ ఆశ్చర్యకర ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రెండో రోజు స్టంప్స్ స‌మానికి నైట్ వాచ్‌మ్యాన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ 66 పరుగులతో కెరీర్‌లో తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జైస్వాల్‌తో కలిసి అతను 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇది మ్యాచ్ మోమెంటమ్‌ను భారత్ వైపు తిప్పేసిన మలుపుగా నిలిచింది.

మిడిల్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా (58), వాషింగ్టన్ సుందర్ (51) అర్ధశతకాలతో స్కోరు బోర్డును బలోపేతం చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టుకు అవసరమైన స్థిరత్వాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలింగ్ దళంపై ఒత్తిడిని పెంచేలా వీరిద్దరి ప్రదర్శన కనిపించింది. వీరి ఇన్నింగ్స్ భారత్‌కు బలమైన లీడ్ ఏర్పరచింది.

కెఎల్ రాహుల్ (7), సాయి సుదర్శన్(11) లను తొలి దశలోనే అవుట్ చేయడం భారత జట్టుకు చిన్న షాక్ ఇచ్చింది. మూడో రోజు మధ్యాహ్నం, శుభ్‌మాన్ గిల్ కేవలం 11 పరుగుల వద్ద గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యుగా ఔటయ్యాడు.

ఇంగ్లండ్ బౌలింగ్ లో జోష్ టంగ్ 5 వికెట్లు తీసి టెస్ట్ కెరీర్‌లో రెండోసారి ఫైవర్ సాధించాడు. గస్ అట్కిన్సన్ మూడు, జామీ ఓవర్టన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

మొత్తంగా భారత్ మొత్తం 396 పరుగులు చేసి, ఇంగ్లండ్‌కు ముందు 374 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఇంకా రెండు రోజులు మిగిలి ఉండటంతో, ఆట రసవత్తరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిచ్ నెమ్మదిగా మారుతున్న నేపథ్యంలో, భారత్ బౌలింగ్ విభాగం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ క్లైమాక్స్ మ్యాచ్ భారత బౌలింగ్ పై ఆధారపడి ఉంటుంది.

Leave a Reply