నంద్యాల జిల్లాలో స్తంభించిన జనజీవనం..

  • పొంగుతున్న వాగులు వంకలు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ఒక్కరోజే 205.2 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నంద్యాల జిల్లాలో శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి 15 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలోని లోతట్టు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ కూలీల కూడా పనులు లేక ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు.

జిల్లాలోని 29 మండలాల్లో శనివారం ఉదయం ఒక్కరోజు 205.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో అత్యధికంగా పగిడాల,జూ పాడు బంగ్లా, కొత్తపల్లె, శ్రీశైలం, నందికొట్కూర్, ఆత్మకూర్, పాములపాడు, మిడ్తూర్, కోయిలకుంట్ల, బండి ఆత్మకూరు, డోన్, వెలుగోడు, చాగలమర్రి, దోర్నిపాడు, ఉయ్యాలవాడ, బనగానిపల్లె, ప్యాపిలి, అవుకు,నంద్యాల, గడివేముల మండలాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

ఈదరు గాలులకు కుంభవృష్టికి పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే జిల్లాలో వేసిన ఉద్యానవన పంటలు టమోటా, ఉల్లి మామిడి, బొప్పాయి, అరటి పంటలు గాలికి నేలకొరిగాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 342 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.

సర్వే నిర్వహించి రైతుల ఆదుకోవాలని కోరుతున్నారు. గత పది రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నాశనమయ్యాయి అని పేర్కొన్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

శ్రీశైలం, సున్నిపెంట, లింగాల గట్టు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు కూడ వర్షపు నీటిలోనే దర్శనం చేసుకోవడం విశేషం.

నల్లమల అడవి ప్రాంతంలో కురిసిన వర్షాలతో మహానంది, రుద్రవరం, బండి ఆత్మకూరు, సిరివెళ్ల ఆత్మకూరు తదితర మండలాల్లో కొండల నుంచి వస్తున్న నీటితో కొన్ని గ్రామాలు జలమయం అయ్యాయి. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాలువ చుట్టూ ఆక్రమణల కారణంగా రోడ్లపైకి నీరు చేరింది.

సంజీవనగర్ బస్టాండ్ ఏరియా సలీం నగర్, హరిజనవాడ, అరుంధతీ నగర్, టేక్కే పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవ నగర్ వెళ్లే రహదారిలో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది.

షాపుల్లోనూ నీరు చేరింది. జిల్లాలోని బవనాసి, కుందు, పాలేరు, శ్యామ్ కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మహనంది నుంచి గాజుల పల్లెకు వెళ్లే రోడ్డులోని పాలేరు వంక వాగు నిండుగా ప్రవహిస్తోంది.

ఆ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. మహానంది పరిధిలోని అగ్రికల్చర్ కళాశాలలో నీరు నిలిచింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు.

Leave a Reply