Nobel Prize | ఘనంగా సీవీ రామన్ జయంతి వేడుకలు

Nobel Prize | ఘనంగా సీవీ రామన్ జయంతి వేడుకలు
Nobel Prize | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలు నిర్వహించగా కార్యక్రమానికి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, పాఠశాల కరస్పాండెంట్ కె. మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సైన్స్ స్కిట్ ను ప్రదర్శించారు. కాగా ప్రదర్శనను విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు తమ ఉపన్యాసాల ద్వారా మన దైనందిన జీవితంలో ప్రతి అంశం కూడా శాస్త్రంతో ముడిపడి ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే 2026 ఫిబ్రవరి 28న “ఉమెన్ ఇన్ సైన్స్ కేటలైజింగ్ వికసిత్ భారత్” అనే థీమ్‌తో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలియజేశారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. ఝాన్సీ రాణి, సైన్స్ ఉపాధ్యాయులు ఏ. సుజాత, బి. గీత, ఎన్. తుకారం, ఎస్. వరలక్ష్మి, బి. హర్షతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
