Nizamabad | వైభవంగా గోదాదేవి-శ్రీ రంగనాథుని కల్యాణ మహోత్సవం

Nizamabad | వైభవంగా గోదాదేవి-శ్రీ రంగనాథుని కల్యాణ మహోత్సవం
Nizamabad | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి- శ్రీ రంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో పవిత్ర గంగాజలాలను తీసుకొచ్చి ఆలయాన్ని శుభ్ర పరిచారు. అనంతరం యజ్ఞం నిర్వహించి,స్వామి వారికి పలు రకాల అభిషేకాలు నిర్వహించారు. కొండపై నుండి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చారు.
అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహతి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే ఒకరోజు ముందు భోగి పండుగ రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది, శ్రీకృష్ణ జన్మాష్టమి, విజయదశమి (దసరా), వైకుంఠ ఏకాదశి, భోగి పండుగ రోజు సంవత్సరంలో ఐదు రోజులు రంగనాథ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తు ఉంటారని గ్రామస్తులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటను ఘనంగా నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకొన్న ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్,కో-అపరేటివ్ సొసైటీ చైర్మన్
గోదాదేవీ – శ్రీ రంగనాథుని కల్యాణ మహోత్సవం సందర్బంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకోన్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు.
